Zomato: మ‌హిళా సిబ్బందికి యూనిఫాంగా కుర్తాలు.. జొమాటో ఐడియాను మెచ్చుకుంటున్న నెటిజ‌న్లు

  • అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌హిళా ఉద్యోగుల‌కు జొమాటో కానుక‌
  • ఇక‌పై యూనిఫాంగా టీ-ష‌ర్టులే కాదు.. కుర్తాలు కూడా వేసుకోవ‌చ్చు
  • కొత్త యూనిఫాం బాగుంద‌ని ఉద్యోగినుల హ‌ర్షం
Zomato Kurta Uniforms for Women Delivery Partners

ఫుడ్ డెలివ‌రీ సంస్థ జొమాటో అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సందర్భంగా త‌మ సంస్థ‌లో ప‌నిచేసే మ‌హిళా సిబ్బందికి కొత్త కానుక ఇచ్చింది. త‌మ సంస్థ‌లో ప‌నిచేసే డెలివ‌రీ మ‌హిళ‌ల‌కు కొత్త యూనిఫాం తీసుకువ‌చ్చింది. దీనిలో భాగంగా ఎరుపు రంగు కుర్తాలు అందించింది. ఈ సంద‌ర్భంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇక‌పై యూనిఫాంగా టీ-ష‌ర్టు ధ‌రించ‌డం త‌ప్పనిస‌రి కాదు అని పేర్కొంది. సౌక‌ర్యంగా ఉంటేనే టీ-ష‌ర్ట్ ధ‌రించాల‌ని లేనిప‌క్షంలో కుర్తా వేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. 

ఈ సంద‌ర్భంగా జొమాటో త‌న లింక్డిన్ పోస్టులో.. 'జొమాటో టీ-ష‌ర్టులు ధ‌రించ‌డంపై చాలామంది మ‌హిళా డెలివ‌రీ ఉద్యోగులు అసౌక‌ర్యాన్ని వ్య‌క్తం చేశారు. వారి అభిప్రాయం మేర‌కు టీ-ష‌ర్ట్ మాత్ర‌మే కాకుండా కుర్తాలు ధ‌రించే వెసులుబాటు క‌ల్పించాం' అని పేర్కొంది. 

ఇక కొత్త యూనిఫాం వేసుకున్న త‌ర్వాత డెలివ‌రీ మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేకంగా ఫొటోషూట్ చేయ‌డం జ‌రిగింది. దాని తాలూకు వీడియోలో మ‌హిళా ఉద్యోగులు కుర్తాలు ధ‌రించి చాలా సౌక‌ర్య‌వంతంగా ఉంద‌ని చెప్ప‌డం మ‌నం చూడొచ్చు. ఓ మ‌హిళ త‌న‌ కుర్తాకు జేబు కూడా ఉంద‌ని ఆనందం వ్య‌క్తం చేయ‌డం కూడా ఆ వీడియోలో ఉంది. 

ఈ ఫొటోషూట్ వీడియోను జొమాటో త‌న ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేయ‌డంతో అది కాస్తా వైర‌ల్ అవుతోంది. జొమాటో కొత్త‌ ఆలోచ‌న చాలా బాగుంద‌ని నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఈ వీడియోకు సోష‌ల్ మీడియాలో వేల సంఖ్య‌లో లైక్స్‌, కామెంట్లు వ‌స్తున్నాయి.

More Telugu News