Narendra Modi: ఏనుగుపై ప్రధాని మోదీ సఫారీ.. వీడియో ఇదిగో

  • అసోంలోని కజిరంగా నేషనల్ పార్క్‌ను సందర్శించిన ప్రధాని
  • ఏనుగుపై సఫారీ చేస్తూ పార్క్ విశిష్టతలు తెలుసుకున్న మోదీ
  • రూ.18,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపనల కోసం అసోంలో 2 రోజుల పర్యటన
PM Modi takes elephant safari at Kaziranga National Park in Assam

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రం అసోం పర్యటనలో ఉన్నారు. శనివారం ఉదయం రాష్ట్రంలోని కజిరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్‌లను ఆయన సందర్శించారు.  ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన కజిరంగా నేషనల్ పార్క్‌లో ప్రధాని మోదీ ఏనుగుపై సఫారీ చేశారు. 

పార్క్‌లోని సెంట్రల్ కోహోరా రేంజ్‌లో ఉన్న మిహిముఖ్ ప్రాంతంలో ఏనుగుపై సఫారీ చేస్తూ పార్క్‌ విశిష్టతలను అడిగి తెలుసుకున్నారు. కెమెరాతో ఫొటోలు తీస్తూ కనిపించారు. అనంతరం అదే రేంజ్‌లో జీప్‌లో ప్రయాణించారు. ప్రధాని వెంట పార్క్ డైరెక్టర్ సోనాలి ఘోష్, ఇతర సీనియర్ అటవీ శాఖ అధికారులు ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంకాలం అసోంకు వెళ్లారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ప్రారంభించనున్నారు. దాదాపు రూ.18,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఒక బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగించనున్నారు.

More Telugu News