India vs England: ఇంగ్లండ్ ఇంత ఘోరంగా ఓడిపోతుండడం నాకు చాలా హ్యాపీగా ఉంది.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • ఇంగ్లండ్ ఓడిపోవడాన్ని ఇష్టపడతానని చెప్పిన ఆసీస్ మాజీ కెప్టెన్ టిమ్ పైన్
  • ఇండియా -బీ టీమ్ చేతిలో ఇంగ్లిష్ జట్టు ఓడిపోయిందని అభివర్ణించిన ఆసీస్ మాజీ దిగ్గజం
  • రోహిత్ శర్మ సేన అద్భుతంగా ఆడిందని ప్రశంసించిన టిమ్ పైన్
I Love Watching England Lose sasy Ex Australia Skipper Tim Pine

భారత్‌తో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పర్యాటక జట్టు ఇంగ్లండ్ స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతోంది. ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్‌ను చేజార్చుకున్న ఇంగ్లిష్ టీమ్... ధర్మశాల వేదికగా జరుగుతున్న 5వ టెస్టులోనూ తేలిపోతోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ టిమ్ పైన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ ఓడిపోతే చూడడాన్ని తాను చాలా ఇష్టపడతానని చెప్పాడు. బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లండ్ టీమ్ ప్రస్తుతం ‘ఇండియా-బీ’ చేతిలో ఓడిపోతోందని, తనకు చాలా సంతోషంగా ఉందని టిమ్ పైన్ వ్యాఖ్యానించాడు.

‘‘ఇంగ్లండ్ ఆటను చూసి చాలా ఆనందించాను. నన్ను తప్పుగా భావించవద్దు. కానీ ఇంగ్లండ్ ఓడిపోవడం నాకు వినోదభరితంగా, ఉత్తేజకంగా ఉంటుంది’’ అని అన్నాడు. ప్రధాన క్రికెటర్లు లేకుండా టీమిండియా అద్భతంగా రాణించడాన్ని ఉద్దేశిస్తూ ‘ఇండియా-బీ టీమ్’గా టిమ్ పైన్ అభివర్ణించాడు. ఇటీవల ‘అరౌండ్ ది వికెట్’ పోడ్‌కాస్ట్‌తో మాట్లాడుతూ టిమ్ పైన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌పై ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ సైమన్ కటిచ్‌తో చర్చిస్తూ ఈ మేరకు స్పందించాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో టీమిండియా అద్భుతంగా రాణిస్తోందని రోహిత్ శర్మ సేనపై ప్రశంసల జల్లు కురిపించాడు. యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్‌లను టిమ్ పైన్ ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు.

2018-19లో ఆస్ట్రేలియా కూడా ఇదే పరిస్థితి ఎదురైందని పైన్ అన్నాడు. అనేక మంది సీనియర్ ఆటగాళ్లు దూరంగా ఉన్న సమయంలో ఆస్ట్రేలియాకు ఓటమి ఎదురైందని గుర్తుచేసుకున్నాడు. భారత్ బీ టీమ్ చేతిలో ఓడిపోవడం ఎలా ఉంటుందో తనకు తెలుసునని వ్యాఖ్యానించాడు.

సైమన్ కటిచ్ కూడా దాదాపు ఇవే అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ‘‘ ఇంగ్లండ్ టీమ్ ఇండియా బీ జట్టుతో ఆడుతోంది. ఎందుకంటే కోహ్లీ, షమీ జట్టులో లేరు. బుమ్రా నాలుగవ మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్నాడు. కేఎల్ రాహుల్ కూడా జట్టుకు అందుబాటులో లేడు. రిషబ్ పంత్ ప్రమాదం తర్వాత గాయాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇంగ్లండ్ ఆడుతున్నది బలమైన టీమిండియా కాదు. అయితే భారత క్రికెట్‌ జట్టు లోతు చాలా పెద్దదని దీని ద్వారా టీమిండియా చూపిస్తోంది. తదుపరి తరం క్రికెట్‌లోకి కొన్ని పెద్ద పేర్లు వస్తున్నాయి. ఈ విషయంలో జైస్వాల్ ముందున్నాడు. నాలుగవ టెస్టులో జురెల్ అద్భుతంగా రాణించాడు. కాబట్టి భారత్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది’' అని పేర్కొన్నాడు.

More Telugu News