Indian Doctor Death in Australia: లోయలో పడి తెలుగు వైద్యురాలి మృతి.. ఆస్ట్రేలియాలో దుర్ఘటన

Indian Doctor in Australia dies after falling into gorge during trekking
  • రాయల్ బ్రిస్బేన్ ఆసుపత్రిలో పనిచేస్తున్న వేమూరు ఉజ్వల
  • ఈ నెల 2న స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన వైనం
  • ప్రమాదవశాత్తూ కాలు జారడంతో లోయలో పడి దుర్మరణం
  • మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు కుటుంబసభ్యుల ఏర్పాట్లు
ఆస్ట్రేలియాలో ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ తెలుగు వైద్యురాలు ప్రమాదవశాత్తూ కాలు జారడంతో కింద పడి దుర్మరణం చెందారు. కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల(23) ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లోగల బాండ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఉజ్వల తల్లిదండ్రులు వేమూరు మైథిలి, వెంకటేశ్వరరావు కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలోనే స్థిరపడ్డారు. వైద్యురాలు కావాలనేది ఉజ్వల చిన్ననాటి కల. ప్రస్తుతం ఆమె రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆసుపత్రిలో పని చేస్తున్నారు. పీజీ కూడా చేసి ఉన్నతస్థాయికి చేరుకోవాలనేది ఆమె లక్ష్యం.

ఈ నెల 2వ తేదీన సరదాగా తోటి స్నేహితులతో కలిసి ఉజ్వల ట్రెక్కింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ కాలు జారడంతో లోయలో పడి దుర్మరణం చెందారు. జీవితంలో ఉన్నత స్థితికి వెళుతుందనుకున్న ఉజ్వల ఇలా ఊహించని విధంగా దూరమవడం ఆమె కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా, ఉజ్వల అంత్యక్రియల నిమిత్తం ఆమె భౌతిక కాయాన్ని ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి తీసుకొస్తున్నారు.
Indian Doctor Death in Australia
Australia
Trekking

More Telugu News