KTR: ఆకాశంలో సగం కాదు.. 'ఆమే' ఆకాశం: కేటీఆర్

  • అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేటీఆర్ శుభాకాంక్షలు
  • మహిళా సంక్షేమంలో యావత్ దేశానికే బీఆర్ఎస్ పాలన ఆదర్శమని వ్యాఖ్య
  • మహిళలకు కేసీఆర్ కొండంత అండగా నిలిచారన్న కేటీఆర్
Woman is half in sky says KTR

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ... బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు ఏమేం చేసిందో వివరించారు.

మహిళా సంక్షేమంలో గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన యావత్ భారత దేశానికే ఆదర్శమని కేటీఆర్ అన్నారు. అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి ఆరు పదులు దాటిన అవ్వ వరకు అందరినీ బీఆర్ఎస్ ప్రభుత్వం కాపాడిందని చెప్పారు. గర్భిణీలకిచ్చిన న్యూట్రిషన్ కిట్లు ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి తొలి మెట్లు అని అన్నారు. ఆడబిడ్డ పుట్టిందంటే.. ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టినట్టేనని చెప్పారు. కేసీఆర్ కిట్ లో పాటు అందిన 13 వేలు.. ప్రతి పుట్టిల్లు ఎప్పటికీ మరువలేని మేలు అని అన్నారు. 

లక్ష్మీ కటాక్షమే కాదు... తెలంగాణ ఆడబిడ్డలకు సరస్వతి కటాక్షం అందించిన ఘనత మనకే సొంతమని కేటీఆర్ చెప్పారు. కార్పొరేట్ కు దీటైన గురుకులాలతో పేద మధ్య తరగతి తల్లిదండ్రుల కలలు సాకారమయ్యాయని తెలిపారు. ఆడబిడ్డలకు రక్షణ కవచంగా నిలిచిన “షీటీమ్స్” ఒక సంచలనమని చెప్పారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు నవ శకం అని అన్నారు. కల్యాణలక్ష్మి కేవలం పథకమే కాదని, ఒక గొప్ప సంప్రదాయమని చెప్పారు.  

"గుక్కెడు మంచినీళ్ల కోసం మైళ్ల దూరం నడిచిన మహిళల కష్టాలను భగీరథతో శాశ్వతంగా తీర్చాం. అమ్మఒడి వాహనాలపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. మహిళా సంక్షేమంలో నాటి పాలనకు ఎదురు లేదని చెప్పారు. భర్తను కోల్పోయిన అక్కాచెల్లెళ్లకు అన్నలా.. ఒంటరి మహిళలకు తండ్రిలా... ఆడబిడ్డలకు మేనమామలా.. అవ్వలకు పెద్దకొడుకులా... కొండంత అండగా నిలిచిన ఏకైక పాలకుడు.. మన కేసీఅర్ గారు" అని అన్నారు.  

పదేళ్ల పాలనలో సముద్రమంత సంక్షేమాన్ని అందించి, ఆడబిడ్డల సమగ్ర అభివృద్ధికి బంగారు బాటలు వేసిన బీఆర్ఎస్ తరపున యావత్ నారీ శక్తికి హృదయపూర్వకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానని కేటీఆర్ ట్వీట్ చేశారు.

More Telugu News