Nara Lokesh: అందుకే టీడీపీతో కలిసి వైసీపీని ఓడించాలని పవన్ అనుకున్నారు: నారా లోకేశ్

  • చంద్రబాబు అరెస్ట్ తర్వాత తనకు తొలుత పవన్ ఫోన్ చేశారన్న లోకేశ్
  • తనకు అన్నగా అండగా ఉంటానని చెప్పారని వెల్లడి
  • ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదే లేదని గతంలోనే జగన్ కు చెప్పానని వ్యాఖ్య
Nara Lokesh fires on Jagan

కార్యకర్తలే టీడీపీకి బలమని, నాయకులు పార్టీ మారినా అండగా నిలిచేది కార్యకర్తలేనని నారా లోకేశ్ అన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలకు బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ కావాలేమో కానీ... టీడీపీ కార్యకర్తలు మాత్రం తమ అధినేత 'రా.. కదలిరా' అంటే వచ్చేస్తారని చెప్పారు. కార్యకర్తల కోసం 2014లో సంక్షేమ నిధిని ఏర్పాటు చేశామని... ప్రమాదంలో చనిపోయిన ప్రతి కార్యకర్త కుటుంబానికి రూ. 2 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటి వరకు రూ. 100 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. తనకు అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు లేరని... కానీ, దివంగత ఎన్టీఆర్ తనకు 60 లక్షల మంది అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములను ఇచ్చారని అన్నారు. పలువురు కార్యకర్తల పిల్లలను తన తల్లి నారా భువనేశ్వరి దత్తత తీసుకుని చదివిస్తున్నారని చెప్పారు. 

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలు, కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు పెట్టారని లోకేశ్ మండిపడ్డారు. తనపై కూడా 22 కేసులు పెట్టారని విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదే లేదని జగన్ కు ఆనాడే చెప్పానని అన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తున్న అధికారులు, వైసీపీ నేతల పేర్లను రెడ్ బుక్ లో ఎక్కిస్తున్నానని చెప్పారు. తాము మాయమాటలు చెప్పి అధికారంలోకి రాలేదని, ప్రజాధనాన్ని లూటీ చేయలేదని అన్నారు. 

చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత తొలుత ఫోన్ చేసింది పవన్ కల్యాణ్ అని తెలిపారు. ఒక అన్నగా అండగా ఉంటానని తనకు చెప్పారని అన్నారు. ఆరోజు విమానంలో రావాలని పవన్ అనుకున్నారని, అయితే అనుమతి ఇవ్వలేదని..రోడ్డు మార్గంలో కూడా అడ్డుకున్నారని మండిపడ్డారు. అందుకే టీడీపీతో కలిసి వైసీపీని ఓడించాలని ఆయన నిర్ణయించుకున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో టిడ్కో ఇళ్లు పూర్తి చేసి, లబ్ధిదారులతో గృహప్రవేశం చేయిస్తామని తెలిపారు.

More Telugu News