Nara Lokesh: వచ్చే ప్రజా ప్రభుత్వంలో సత్యసాయి సంస్థల సేవలను విస్తృతం చేస్తాం: లోకేశ్

TDP Leader Nara Lokesh Visits Puttaparthi On The Eve Of Maha Shivrathri
  • శివరాత్రిని పురస్కరించుకుని పుట్టపర్తిని సందర్శించిన యువనేత
  • స్వాగతం పలికిన సత్యసాయి సంస్థ ప్రతినిధులు
  • సత్యసాయిబాబా స్ఫూర్తితోనే ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్న లోకేశ్
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని టీడీపీ యువనేత, ఆ పార్టీ ప్రధాన కార్యాదర్శి నారా లోకేశ్ ఈ ఉదయం పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. అక్కడి కుల్వంత్ హాలులో భగవాన్ సత్యసాయిబాబా సన్నిధిలో ప్రతిష్ఠించిన సాయీశ్వర లింగం వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రశాంతి నిలయాన్ని సందర్శించిన లోకేశ్‌కు సత్యసాయి సంస్థ ప్రతినిధులు సాదర స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లో 1200కుపైగా కేంద్రాల ద్వారా ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నట్టు లోకేశ్‌కు వివరించారు. ఆయా దేశాల నుంచి ఏటా లక్షలాదిమంది భక్తులు ప్రశాంతి నిలయాన్ని సందర్శిస్తూ బాబా అనుగ్రహం పొందుతున్నట్టు చెప్పారు. సత్యసాయి తాగునీటి ప్రాజెక్టు ద్వారా అనంతపురం జిల్లాతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లోని 1500కు పైగా మారుమూల గ్రామాలకు తాగునీరు అందిస్తున్నట్టు తెలిపారు. 

 పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లోని సత్యసాయి జనరల్ ఆసుపత్రి ద్వారా లక్షలాదిమందికి ఉచితంగా వైద్యం అందిస్తున్నట్టు పేర్కొన్నారు. లోకేశ్ మాట్లాడుతూ సత్యసాయిబాబా ద్వారా స్ఫూర్తి పొందిన తాము ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్టు చెప్పారు. రాబోయే ప్రజా ప్రభుత్వంలో సత్యసాయి సంస్థలు అందించే సేవలను మరింత విస్తృతం చేసేందుకు అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.
Nara Lokesh
Satya Saibaba
Puttaparthi
Telugudesam
Maha Shivrathri

More Telugu News