Dharamsala Test: ధర్మశాల టెస్టులో 48 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన భారత స్పిన్నర్లు

  • టెస్ట్ మ్యాచ్ మొదటి రోజున ప్రత్యర్థి జట్టు 10 వికెట్లనూ భారత స్పిన్నర్లే పడగొట్టడం 48 ఏళ్లలో ఇదే తొలిసారి 
  • 1976 తర్వాత తొలిసారి ప్రత్యర్థి జట్టుని తొలి రోజే కుప్పకూల్చిన స్పిన్నర్లు  
  • ధర్మశాల టెస్టులో 5 వికెట్లతో చెలరేగిన కుల్దీప్ యాదవ్ 
  • అశ్విన్‌ 4 , రవీంద్ర జడేజా 1 వికెట్ పడగొట్టడంతో నమోదైన రికార్డు
Indian spinners broke the 48 yearold record in the Dharamsala Test

ధర్మశాల వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజున టీమిండియా సంపూర్ణ ఆధిపత్యాన్ని సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పర్యాటక జట్టుని కేవలం 218 పరుగులకే భారత్ ఆలౌట్ చేసింది. ఆ తర్వాత ఓపెనర్ యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ చక్కటి ఆరంభాన్ని అందించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 1 వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. జైస్వాల్ 57 పరుగులు చేసి ఔట్ అవ్వగా ప్రస్తుతం రోహిత్ శర్మ (52), శుభ్‌మాన్ గిల్ (26) క్రీజులో ఉన్నారు. అయితే ఇంగ్లండ్‌ను స్వల్ప స్కోరుకే కట్టడి చేయడంలో టీమిండియా స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ విజయవంతమయ్యారు. కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో అదరగొట్టాడు. ఇక అశ్విన్ 4 వికెట్లు తీసి శభాష్ అనిపించుకున్నాడు. మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా మరో వికెట్ పడగొట్టాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 10 వికెట్లను స్పిన్నర్లే తీసినట్టయ్యింది. దీంతో 48 ఏళ్ల అరుదైన రికార్డు బ్రేక్ అయ్యింది.

గత 48 ఏళ్ల క్రికెట్ చరిత్రలో భారత స్పిన్నర్లు టెస్టు మ్యాచ్ మొదటి రోజున మొత్తం 10 వికెట్లు తీయడం ఇదే తొలిసారి. అంతక్రితం 1976లో ఆక్లాండ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదయింది. ఆట తొలి రోజున భారత స్పిన్నర్లు పది వికెట్లు పడగొట్టారు. దానికంటే ముందు 1973లో కూడా ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. చెన్నై వేదికకగా ఇంగ్లండ్‌పై టెస్టు మొదటి రోజున పది వికెట్లు తీసి సంచలనం సృష్టించారు. మళ్లీ సుదీర్ఘ విరామం తర్వాత భారత స్పిన్నర్లు చెలరేగి టెస్ట్ మ్యాచ్ తొలి రోజునే ప్రత్యర్థి జట్టుని ఆలౌట్ చేశారు.

కాగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా 56 ఫస్ట్ క్లాస్ టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. కానీ ఒక ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లు 10 వికెట్లు తీయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు ఈ మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ టెస్టుల్లో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తక్కువ బంతుల్లో వేగంగా 50 వికెట్ల మైలురాయిని అందుకున్న భారతీయ బౌలర్‌గా అశ్విన్ అవతరించాడు.

More Telugu News