Pawan Kalyan: నాకు సలహాలు ఇచ్చిన వాళ్లు వైసీపీలో చేరుతున్నారు: ముద్రగడ, చేగొండిలపై పవన్ విమర్శలు

  • తనకు ఇలాంటి వ్యక్తుల సలహాలు, సూచనలు అవసరం లేదన్న పవన్
  • చిత్తూరు జిల్లా ఒక కుటుంబం చేతిలో బందీ అయిందని విమర్శ
  • వైసీపీకి కొమ్ము కాస్తున్న పోలీసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
Pawan Kalyan indirect comments on Mudragada and Harirama Jogaiah

చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఈరోజు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పటి నుంచి తనకు శ్రీనివాస్ తెలుసని చెప్పారు. తనతో కలిసి ప్రయాణిస్తానని శ్రీనివాస్ చెప్పారని తెలిపారు. చిత్తూరు జిల్లా ఒక కుటుంబం చేతిలో బందీ అయిపోయిందని విమర్శించారు. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిలతో తనకు వ్యక్తిగత వైరమేమీ లేదని చెప్పారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే రాయలసీమలో ఏమీ మిగలదని అన్నారు. రాయలసీమ నుంచి ఉపాధి కోసం ఎంతో మంది గల్ఫ్ దేశాలకు వెళ్లిపోతున్నారని చెప్పారు. జగన్ గ్యాంగ్ నుంచి రాయలసీమను రక్షించుకోవాలని అన్నారు. 

తనకు వ్యక్తిగతంగా డబ్బు, పలుకుబడి, పెద్ద కుటుంబం ఉన్నాయని... వాటిని వదులుకునే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ చెప్పారు. తెలుగు జాతిని తన కుటుంబం అనుకున్నానని తెలిపారు. చిన్న కులాల్లో ఐక్యత లేకపోవడం వల్లే జగన్ కు ఊడిగం చేస్తున్నారని అన్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు తమ ఆవరణలోకి వచ్చారని.. ప్రజాస్వామ్యంలో ఇదంతా సాధారణమే అంటే కుదరదని చెప్పారు. వైసీపీకి కొమ్ము కాస్తున్న పోలీసు అధికారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 

మరోవైపు కాపు నేతలు ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామజోగయ్యలపై పవన్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మొన్నటి వరకు వీరు తనకు సలహాలు ఇచ్చారని... ఇప్పుడు వైసీపీలోకి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. అవసరాల మేరకు మాట్లాడే వ్యక్తులు తనకు అవసరం లేదని అన్నారు. సీట్లు ఎన్ని తీసుకోవాలి, రాజకీయాలు ఎలా చేయాలి అనే విషయంపై ఇలాంటి వాళ్ల సలహాలు, సూచనలు తనకు అవసరం లేదని చెప్పారు. ఇకపై కాపు రిజర్వేషన్ల గురించి కానీ, ఇతర అంశాల గురించి కానీ పద్ధతి ప్రకారం మాట్లాడాలని సూచించారు. 

More Telugu News