India vs England: ధ‌ర్మ‌శాల టెస్టు.. ముగిసిన తొలిరోజు ఆట‌.. టీమిండియాదే పైచేయి

  • బౌలింగ్‌లో కుల్దీప్, అశ్విన్‌ విజృంభ‌ణ‌
  • ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 218 ప‌రుగుల‌కు ఆలౌట్‌
  • తొలిరోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ స్కోర్‌: 135/1
  • అర్ధ‌శ‌త‌కాలతో రాణించిన ఓపెన‌ర్లు రోహిత్‌, య‌శ‌స్వి
5th Test at Dharamsala India trail by 83 runs

ఇంగ్లండ్‌తో ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రుగుతున్న‌ ఆఖ‌రిద‌యిన ఐదో టెస్టు తొలిరోజు ఆట ముగిసింది. ఆట‌ముగిసే స‌మ‌యానికి ఆతిథ్య భార‌త్ తొలి ఇన్నింగ్స్ వికెట్ న‌ష్టానికి 135 ప‌రుగులు చేసింది. క్రీజులో రోహిత్ శ‌ర్మ‌(52), శుభ‌మ‌న్ గిల్ (26) ఉన్నారు. అంత‌కుముందు టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జ‌ట్టు 218 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. దీంతో ప్ర‌స్తుతం టీమిండియా ఇంకా 83 ప‌రుగులు వెనుకబ‌డి ఉంది. 

తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జ‌ట్టును భార‌త స్పిన్న‌ర్లు చుట్టేశారు. కుల్దీప్ యాద‌వ్ 5వికెట్ల‌తో ఇంగ్లీస్ జ‌ట్టును దెబ్బ‌తీశాడు. అలాగే వందో టెస్టు ఆడుతున్న అశ్విన్ కూడా నాలుగు వికెట్లతో రాణించాడు. ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ జాక్ క్రాలీ అర్ధ‌శ‌త‌కం (79)  చేయ‌గా.. డ‌కెట్ (27), బెయిర్ స్టో (29), జో రూట్ (26) ప‌రుగుల‌తో ప‌ర్వాలేద‌నిపించాడు. చివ‌రికి 57.4 ఓవ‌ర్ల‌లో ఇంగ్లండ్ 218 ప‌రుగుల‌కు చాప‌చుట్టేసింది. 

అనంత‌రం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించింది. వ‌న్డే త‌ర‌హా బ్యాటింగ్‌తో ఓపెన‌ర్లు య‌శ‌స్వి, రోహిత్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగారు. ఫోర్లు, సిక్స‌ర్లతో స్కోర్ బోర్డును ప‌రిగెత్తించారు. మొద‌ట య‌శ‌స్వి అర్ధ‌శ‌త‌కం (58 బంతుల్లో 57 ప‌రుగులు) తో రెచ్చిపోయాడు. ధాటిగా ఆడే క్ర‌మంలో 57 ప‌రుగుల వ‌ద్ద యశస్వి వెనుదిరిగాడు. అప్ప‌టికే భార‌త్ స్కోర్ 104 ప‌రుగుల‌కు చేరింది. 

ఆ త‌ర్వాత మ‌రో ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ కూడా హాఫ్ సెంచ‌రీ నమోదు చేశాడు. 52 ప‌రుగుల‌తో నాటౌట్‌గా ఉన్న రోహిత్ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, రెండు సిక్స‌ర్లు ఉన్నాయి. అటు య‌శ‌స్వి ఔటయిన త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన యువ ఆట‌గాడు శుభ‌మ‌న్ గిల్ కూడా ధాటిగానే ఆడుతున్నాడు. ప్ర‌స్తుతం 26 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్న అత‌ని ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్స‌ర్లు ఉన్నాయి. ఇక తొలిరోజు ఆట‌ముగిసే స‌మ‌యానికి టీమిండియా 30 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టానికి 135 ప‌రుగులు చేసింది.

More Telugu News