Garry Kasparov: చెస్ దిగ్గ‌జం గ్యారీ కాస్ప‌రోవ్‌ను ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌టించిన ర‌ష్యా

  • ప్ర‌భుత్వంపై కాస్ప‌రోవ్ బ‌హిరంగ విమ‌ర్శ‌లే దీనికి కార‌ణమంటున్న ర‌ష్యా మీడియా
  • ప‌దేళ్లుగా అమెరికాలోనే ఉంటున్న వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌
  • పుతిన్ స‌ర్కార్ చ‌ర్య‌ను ఖండించిన హ‌క్కుల సంఘాలు
Chess legend Garry Kasparov added to terrorists and extremists list by Russia

చెస్ దిగ్గ‌జం గ్యారీ కాస్ప‌రోవ్‌ను ర‌ష్యా ఉగ్ర‌వాదుల జాబితాలో చేర్చింది. ఈ మేర‌కు ర‌ష్యాలోని వ్లాదిమిర్ పుతిన్ స‌ర్కార్‌ తాజాగా ఒక‌ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. పుతిన్ ప్ర‌భుత్వంపై ఆయ‌న బ‌హిరంగంగా విమ‌ర్శ‌లు గుప్పించ‌డ‌మే దీనికి ప్ర‌ధాన కార‌ణంగా తెలుస్తోంది. ప్ర‌భుత్వ విధానాలను కాస్ప‌రోవ్ వ్య‌తిరేకించ‌డం వ‌ల్లే అధికారులు ఆయ‌న్ను 'ఉగ్ర‌వాదులు, తీవ్రవాదులు' జాబితాలోకి చేర్చార‌ని అక్క‌డి మీడియా పేర్కొంది. 

ఇక చ‌ద‌రంగంలో ప‌లుమార్లు వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌గా నిలిచిన 60 ఏళ్ల గ్యారీ కాస్ప‌రోవ్ చాలా కాలంగా పుతిన్ ప్ర‌భుత్వంపై బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ప‌సికూన ఉక్రెయిన్‌పై ర‌ష్యా సైనిక చ‌ర్య‌ను సైతం అనేక‌మార్లు ఆయ‌న‌ తీవ్రంగా ఖండించారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా రోస్‌ఫిన్‌మానిట‌రింగ్ (ర‌ష్యా ఆర్థిక ప‌ర్య‌వేక్ష‌ణా సంస్థ‌)  విడుద‌ల చేసిన ఉగ్ర‌వాదుల జాబితాలోకి గ్యారీ కాస్ప‌రోవ్‌ను చేర్చింది. అయితే, ఏ కార‌ణంచేత ఆయ‌న పేరును ఈ జాబితాలో చేర్చిందనే విష‌యాన్ని మాత్రం వెల్ల‌డించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. కాగా, ఈ జాబితాలో పేరు ఉన్న వ్య‌క్తుల ఆర్థిక లావాదేవీల‌పై తీవ్ర ఆంక్ష‌లు ఉంటాయి.  

ఇక గ్యారీ కాస్ప‌రోవ్ ప్ర‌భుత్వ అణ‌చివేత విధానాల‌కు భ‌య‌ప‌డి 2014లోనే ఆయ‌న ర‌ష్యా నుంచి వెళ్లిపోయారు. ప‌దేళ్లుగా అమెరికాలోనే ఉంటున్నారు. 2022లో ర‌ష్యా న్యాయ‌శాఖ ఆయ‌న‌పై విదేశీ ఏజెంట్ అనే ముద్ర కూడా వేసింది. కాగా, గ్యారీ కాస్ప‌రోవ్‌పై పుతిన్ స‌ర్కార్ తీసుకున్న చ‌ర్య‌ల‌ను హ‌క్కుల సంఘాలు త‌ప్పుబ‌డుతున్నాయి. ప్ర‌త్య‌ర్థుల అణ‌చివేత‌కు ఈ ఆంక్ష‌ల‌ను ర‌ష్యా ప్ర‌భుత్వం ఆయుధంగా ఉప‌యోగిస్తుంద‌ని మండిప‌డుతున్నాయి.

More Telugu News