Biopsy: బయాప్సీ ఫ‌లితాల కోసం రోజుల త‌ర‌బ‌డి నిరీక్షణ‌కు తెర‌.. కేవ‌లం 5 నిమిషాల్లోనే మ‌న చేతికి రిజ‌ల్ట్‌

  • ఇంత‌కుముందు ఫ‌లితాల‌కు ఐదు రోజులు 
  • వివాస్కోప్ సాంకేతిక‌త ద్వారా కేవ‌లం ఐదు నిమిషాల్లోనే ఫ‌లితాల వెల్ల‌డి
  • గ‌చ్చిబౌలిలోని ఏఐజీలో మొద‌టిసారి అందుబాటులోకి సరికొత్త టెక్నాల‌జీ
AIG New Tech Ends Inordinate Wait for Biopsy Results

సాంకేతికత అంత‌కంత‌కు అభివృద్ధి చెందుతున్న నేప‌థ్యంలో వైద్య‌రంగంలోనూ పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నో క‌ఠిన‌మైన‌, శ్ర‌మ‌తో కూడుకున్న చికిత్స‌లు సైతం చాలా సులువుగా అతి త‌క్కువ స‌మ‌యంలో అయిపోతున్నాయి. ఇదేకోవ‌లో తాజాగా బయాప్సీ ఫ‌లితాల కోసం రోజుల త‌ర‌బ‌డి నిరీక్షించే ప‌రిస్థితుల‌కు తెర‌ప‌డింది. ఇక‌పై కేవ‌లం 5 నిమిషాల వ్య‌వ‌ధిలోనే ఈ ఫ‌లితాలు మ‌న చేతిలో ఉండ‌నున్నాయి. ప్ర‌స్తుతం అమెరికా, జ‌ర్మ‌నీల‌లో అందుబాటులో ఉన్న సాంకేతిక‌త‌ను హైద‌రాబాద్‌ గ‌చ్చిబౌలిలోని ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జీ (ఏఐజీ) తీసుకువ‌చ్చింది. వివాస్కోప్ అనే విప్ల‌వాత్మ‌క ఇన్‌స్టెంట్ డిజ‌ట‌ల్ పాథాల‌జీ టెక్నాల‌జీని ఆసియా-ప‌సిఫిక్ ప్రాంతంలో మొట్ట‌మొద‌టిసారి ప్ర‌వేశ‌పెట్టింది. 

ఈ సంద‌ర్బంగా ఏఐజీ ఛైర్మ‌న్ డాక్ట‌ర్ నాగేశ్వ‌ర్‌రెడ్డి, డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ జీవీ రావు, పాథాల‌జీ డైరెక్ట‌ర్ వైద్యురాలు అనురాధ బుధ‌వారం ఈ సాకేంతిక‌త వివ‌రాల‌ను మీడియాకు వెల్ల‌డించ‌డం జ‌రిగింది. డాక్ట‌ర్ నాగేశ్వ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇప్ప‌టివ‌ర‌కు బయాప్సీ ఫ‌లితాల కోసం ఐదు రోజుల వ‌ర‌కు వేచి చూడాల్సి వ‌చ్చేది. ఇప్పుడు కేవ‌లం ఐదు నిమిషాల్లోనే ఫ‌లితాలు మ‌న చేతికి వ‌చ్చేస్తాయి. వివాస్కోప్ టెక్నాల‌జీ కార‌ణంగానే ఇది సాధ్య‌మైంది. త‌ద్వారా వేగంగా రోగ నిర్ధార‌ణ చేసి చికిత్స చేయ‌డం ద్వారా రోగికి మెరుగైన ఫ‌లితాల‌ను అందించే వెసులుబాటు క‌లుగుతుంది. ప్ర‌ధానంగా జీఐ క్యాన్స‌ర్ల‌కు సంబంధించి స‌త్వ‌ర నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన స‌మ‌యంలో ఈ సాంకేతిక‌త చాలా కీల‌క పాత్ర పోషిస్తుందని చెప్పారు.

More Telugu News