Houthi attack: ఎర్ర సముద్రంలో మరో నౌకపై హౌతీ రెబల్స్ క్షిపణి దాడి.. తొలిసారి ముగ్గురు సిబ్బంది మృతి

  • బార్బడోస్ జెండాతో ఉన్న ‘ట్రూ కాన్ఫిడెన్స్’ అనే వాణిజ్య నౌకపై దాడి
  • బ్రిటన్, అమెరికా అధికారుల వెల్లడి
  • దాడికి బాధ్యత వహిస్తున్నామని ప్రకటించిన హౌతీ
Houthi attack on a ship in Red Sea and in a first time three died

ఎర్ర సముద్రంలో ఇరాన్ సహకారంతో యెమెన్ తిరుగుబాటు గ్రూపు హౌతి రెబల్స్ ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం మరో వాణిజ్య నౌకపై హౌతీ రెబల్స్ క్షిపణి దాడి చేశారు. ఈ ఘటనలో నౌకలోని ముగ్గురు సిబ్బంది చనిపోయారు. వాణిజ్య రవాణాతో అత్యంత రద్దీగా ఉండే ఎర్ర సముద్ర మార్గంలో నౌకలపై హౌతి దాడులు చేయడం మొదలుపెట్టాక నౌకా సిబ్బంది చనిపోవడం ఇదే తొలిసారి. బుధవారం జరిగిన దాడిలో ముగ్గురు అమాయక సిబ్బంది చనిపోయారని బ్రిటన్, అమెరికా అధికారులు తెలిపారు. అమాయక సిబ్బంది చనిపోయారని ‘ఎక్స్’ వేదికగా బ్రిటన్ రాయబార కార్యాలయం ప్రకటించింది. అంతర్జాతీయ షిప్పింగ్‌ లక్ష్యంగా క్షిపణులతో దాడులు చేయడం విచారకరమని, తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన నౌకా సిబ్బంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొంది.

కాగా ఈ దాడి తమదేనని హౌతీ బాధ్యత వహించింది. యెమెన్‌లోని ఏడెన్ పోర్టుకు 50 నాటికల్ మైళ్ల దూరంలో బార్బడోస్ జెండాతో ఉన్న ‘ట్రూ కాన్ఫిడెన్స్’ షిప్‌ దగ్ధమైపోయిందని పేర్కొంది. కాగా అమెరికా సీనియర్ అధికారి ఒకరు స్పందిస్తూ.. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా హౌతీ రెబల్స్ గతేడాది నవంబర్ నుంచి ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. బ్రిటన్, అమెరికా దేశాల హౌతీలపై ప్రతీకార దాడులు మొదలు పెట్టాయని అన్నారు.

More Telugu News