Jayaprakash Narayan: డెత్ సర్టిఫికెట్‌పై సీఎం బొమ్మా.. ఇంతకంటే దారుణం ఇంకెక్కడ వుంది?: జయప్రకాశ్ నారాయణ ఫైర్

  • రాజకీయాల్లో గ్లామర్ పెరిగిపోయిందన్న లోక్‌సత్తా అధినేత
  • సర్వే రాళ్లపైనా సీఎం బొమ్మలు వేస్తున్నారన్న జేపీ
  • అందరూ కలిసి సమాజాన్ని దరిద్రంగా తయారుచేస్తున్నారని ఆవేదన
  • ప్రజలే దీనికి ఫుల్‌స్టాప్ పెట్టాలని పిలుపు
Loksatta Chief Jayaprakash View On Present Politics

సమకాలీన రాజకీయాలపై నిష్పక్షపాతంగా తన అభిప్రాయాలు వెల్లడించే మాజీ ఐఏఎస్ అధికారి, లోక్‌సత్తా చీఫ్ జయప్రకాశ్ నారాయణ మరోమారు సంచలన ఆలోచింపజేసే వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు, ఐఏఎస్‌లకు ఇటీవల గ్లామర్‌ను ఆపాదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రచార పిచ్చి పతాకస్థాయికి చేరిందని, లేకపోతే మరణ ధ్రువీకరణ పత్రంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫొటో ఏంటని ప్రశ్నించారు. పట్టాదారు పాసుపుస్తకాల్లోనూ, చివరికి సర్వే రాళ్లపైనా సీఎం ఫొటోలు వేస్తున్నారని, ఇంతకంటే దారుణం ఇంకెక్కడ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ కలిసి సమాజాన్ని దరిద్రంగా తయారుచేస్తున్నారని, దీనికి ఫుల్‌స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

దురదృష్టవశాత్తు న్యాయవ్యవస్థ కూడా అంత ప్రభావవంతంగా పనిచేయడం లేదన్నారు. కోర్టు ఇటీవల ఓ తీర్పు చెబుతూ ప్రజల సొమ్ముతో ప్రచారం చేసుకుంటునప్పుడు ఎక్కడా ఫొటోలు కానీ, పేర్లు కానీ ఉండకూడదని చెప్పిందని కానీ, ప్రధానమంత్రికి, ప్రధాన న్యాయమూర్తికి మినహాయింపు ఇచ్చిందని గుర్తు చేశారు. వారిద్దరికి మాత్రం మినహాయింపు ఎందుకని ప్రశ్నించారు. నైతిక విలువలు లేనప్పుడు, ఉల్లంఘనలకు పాల్పడినప్పుడు నాయకుడి మాటకు విలువ ఎక్కడ ఉంటుందని అన్నారు.

ఈ తీర్పును అందరూ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అన్నారని, నిజానికి ల్యాండ్ మార్కు కాదు.. మరోటీ కాదని కొట్టిపడేశారు. ఆ జడ్జిమెంటుతో ఒరిగిందేంటని నిలదీశారు. సమాజంలో జుగుప్సాకరమైన సంస్కృతి పెరిగిపోయిందని, లక్ష్యం కోసం పనిచేయడం కాకుండా ప్రతిదాంట్లో ‘నేను’ అనే అహం పెరిగిపోయిందని విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి దానిపై ప్రజల నుంచి వ్యతిరేకత రావాలని, ఇప్పుడిప్పుడే కొంత కనిపిస్తున్నదని అన్నారు. కుటుంబ పాలనపై ఇటీవల కొంత వ్యతిరేకత కనిపించడం శుభపరిణామమని జయప్రకాశ్ నారాయణ పేర్కొన్నారు.

More Telugu News