Cyber Scam: ఆధార్ మిస్ యూజ్ అయిందంటూ ఫోన్ కాల్.. సాయం పేరుతో స్కామ్

  • సైబర్ స్కామ్ బారి నుంచి కొద్దిలో తప్పించుకున్న చెన్నై మహిళ
  • జాగ్రత్తలు చెబుతూ సాయం చేస్తానంటూ నమ్మబలికిన స్కామర్
  • పోలీసులు వచ్చే వరకూ ఎదురుచూస్తానని చెప్పి తప్పించుకున్న గృహిణి
How Chennai Woman Evaded Drug Smuggling Scam

‘మీ ఆధార్ నెంబర్ తో థాయ్ లాండ్ కు డ్రగ్స్ పార్సెల్ పంపించారు.. మీపై కేసు నమోదైంది. మీరు ఇబ్బందుల్లో పడకుండా నేను సాయం చేస్తా’ అంటూ చెన్నై మహిళకు ఫోన్ చేశాడో సైబర్ దుండగుడు. ఓ లింక్ పంపించి ఆధార్ మిస్ యూజ్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేయాలని సూచించాడు. అంతేకాదు, ఇటీవల ఇలాంటి సైబర్ నేరాలు పెరిగిపోయాయని జాగ్రత్తలు చెబుతూ నమ్మించే ప్రయత్నం చేశాడు. తనకు తెలిసిన మంచి పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడించి కేసు లేకుండా చూస్తానంటూ ఆఫర్ చేశాడు. ముందు తాను పంపిన లింక్ ఓపెన్ చేసి ఫిర్యాదు చేయాలని ఒత్తిడి చేశాడు. అయితే, గతంలో హైదరాబాద్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగినిని ఇలాగే బురిడీ కొట్టించిన విషయం తను న్యూస్ లో చూశానని, సమయానికి అది గుర్తుకు రావడంతో స్కామర్ బారిన పడకుండా తప్పించుకున్నానని చైన్నైకి చెందిన గృహిణి లావణ్య మోహన్ తెలిపారు.

అయితే, ఈ ఫోన్ కాల్ లో స్కామర్ చెప్పిన వివరాలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని, తన ఆధార్ నెంబర్ తో పాటు ఇతరత్రా ఐడీ వివరాలు చెప్పాడని వివరించారు. అంతేకాదు, స్కామర్ తనకు పంపిన లింక్ లు కూడా అచ్చంగా ఒరిజినల్ బ్యాంకు ఖాతాలను పోలి ఉన్నాయని చెప్పారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మోసపోవడం తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఆధార్ మిస్ యూజ్ చేశారంటూ పోలీసులు వచ్చే వరకూ తాను ఎదురుచూస్తానంటూ ఫోన్ పెట్టేశానని లావణ్య చెప్పారు. ఇలాంటి ఫోన్ కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తూ.. తన సోషల్ మీడియా ఖాతాలో లావణ్య మోహన్ తన అనుభవాన్ని పంచుకున్నారు.

More Telugu News