Chadalavada Srinivasa Rao: పెద్ద హీరోలతో సినిమాలు చేయకపోవడమే నా ఆరోగ్య రహస్యం.. బతికుండగా వారితో చేయను: చదలవాడ శ్రీనివాసరావు

Film Maker Chadalavada Srinivasa Rao Sensational Comments On Big Heros
  • చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘రికార్డు బ్రేక్’ మూవీ
  • ఎల్లుండి ప్రేక్షకుల ముందుకు 
  • సినిమా మనసులు హత్తుకునేలా ఉంటుందన్న దర్శకుడు 
  • గతంలో దర్శకనిర్మాతల మధ్య మధ్య బంధం భార్యాభర్తల్లా ఉండేదని వ్యాఖ్య
  • ఇప్పుడు దర్శకుడు హీరో అయిపోయి, నిర్మాతను పట్టించుకోవడం లేదని ఆవేదన 
తాను బతికి ఉండగా పెద్ద హీరోలతో సినిమాలు చేయబోనని, తాను ఈరోజు ఆరోగ్యంగా ఉన్నానంటే వారితో సినిమాలు చేయకపోవడమే కారణమని దర్శకనిర్మాత చదలవాడ శ్రీనివాసరావు సంచలన కామెంట్స్ చేశారు. ఆయన దర్శకత్వం వహించిన ‘రికార్డు బ్రేక్’ మూవీ ఎల్లుండి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘రికార్డు బ్రేక్’ సినిమాకు పెద్దమొత్తంలో ఖర్చు చేసినట్టు వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. గతంలో హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ తక్కువ ఉండేదని, డైరెక్టర్లు, నిర్మాతలు కూడా ఇంతమంది లేరని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుత పరిస్థితులు వేరని, బిచ్చగాడు వంటి సినిమాను నిర్మించిన తర్వాత కంటెంట్ ఉంటే ప్రజలు ఎలాంటి సినిమాను అయినా సక్సెస్ చేస్తారని అర్థమైందన్నారు. అందుకనే ప్రజల మనసుకు హత్తుకునేలా వాస్తవానికి దగ్గరగా ఉండేలా ఉండేలా ఈ సినిమా కోసం పెద్దమొత్తంలో ఖర్చు చేసినట్టు చెప్పారు. మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు, మీడియాకు వేసిన షోలో మంచి రెస్పాన్స్ వచ్చిందని, రికార్డు బ్రేక్ అనేది ఈ సినిమాకు సరైన టైటిట్ అని అందరూ చెప్పడంతో సంతృప్తి అనిపించిందని పేర్కొన్నారు. సినిమాకు గ్రాఫిక్స్ అవసరం కాబట్టే వాటిని చేయించినట్టు చెప్పారు.

బిచ్చగాడు సినిమాకు పూర్తి విరుద్ధం
ఈ సినిమా హీరోల గురించి మాట్లాడుతూ.. ఈ మూవీకి వారు సరిగ్గా సూటయ్యారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న హీరోల్లో అంత బాడీ ఉన్నవారు ఎవరూ లేరని, అప్పట్లో అయితే ఎన్టీఆర్, కృష్ణంరాజు ఉండేవారని అన్నారు. సినిమా రిలీజయ్యాక ప్రజల గుండెల్లో నిలిచిపోవాలన్న లక్ష్యంతో ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించినట్టు చదలవాడ చెప్పారు.  తెనాలిలో చిన్న కర్రల వ్యాపారం చేసుకునే స్థాయి నుంచి వచ్చి నేడు ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నానని పేర్కొన్నారు. అప్పట్లో తాను తీసిన ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ సినిమా విజయవాడ, వైజాగ్ లాంటి ప్రాంతాల్లో బాగా ఆడిందన్నారు. సినిమా నిడివిని 20 నిమిషాలు తగ్గించడం వల్ల మరింత బాగా వచ్చిందని, సినిమా చాలా బాగుందని ఆర్.నారాయణమూర్తి ప్రశంసించారని వివరించారు.  బిచ్చగాడు సినిమాలో తల్లి కోసం బిడ్డ కష్టపడతాడని, ఈ సినిమాలో బిడ్డల కోసం తల్లి ఏం చేసిందనే కాన్సెప్ట్ ఉందని చదలవాడ చెప్పుకొచ్చారు. సినిమాలో క్లైమాక్స్ అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పారు. 

సక్సెస్ రేటు తగ్గడానికి అదే కారణం
గతంలో నిర్మాత, దర్శకుడి బంధం భార్యాభర్తల్లా ఉండేదని, కానీ ఇప్పుడు డైరెక్టర్ హీరోయి అయిపోయాడని, ప్రొడ్యూసర్‌కి అంత విలువ ఇవ్వడం లేదని, సక్సెస్ రేటు తగ్గడానికి అది కూడా ఒక కారణమని పేర్కొన్నారు.  గతంలో తాను శోభన్‌బాబు, నాగేశ్వరరావు, కృష్ణ వంటి వారితో సినిమాలు చేశానని, షూటింగ్ టైంకి తాను వెళ్లకపోయినా, వారు మాత్రం ముందే వచ్చి కూర్చునేవారని గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా ద్వారా దర్శకత్వం నేర్చుకున్నానని, ఈ మూవీ సక్సెస్ తర్వాత మంచి టెక్నికల్ వాల్యూస్‌తో వార్నర్ బ్రదర్స్ కంటే గొప్ప సినిమా తీసి చూపిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.
Chadalavada Srinivasa Rao
Record Break
Tollywood
Movie News
Interview

More Telugu News