a raja: భారతదేశంపై డీఎంకే ఎంపీ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు... అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్

DMK MP A Raja claims India not a nation BJP demands arrest
  • భారత్ ఎప్పుడూ ఒక దేశం కాదని... ఎప్పుడూ ఒక దేశంగా లేదని వ్యాఖ్య
  • ఒకే భాష, ఒకే సంప్రదాయం, ఒకే సంస్కృతి వంటి లక్షణాలు ఉంటే ఒకే దేశం అంటారన్న రాజా
  • రాజా వ్యాఖ్యలపై మండిపడిన బీజేపీ
  • డీఎంకే నేత వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ పార్టీ
డీఎంకే ఎంపీ ఎ. రాజా భారత దేశంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. భారత్ ఎప్పుడూ ఒక దేశం కాదన్న ఆయన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇటీవల ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రాజా మాట్లాడుతూ, భారత్ ఎప్పుడూ ఒక దేశం కాదని... ఎప్పుడూ ఒక దేశంగా లేదన్నారు. ఒకే భాష, ఒకే సంప్రదాయం, ఒకే సంస్కృతి వంటి లక్షణాలు ఉంటే ఒకే దేశం అంటారని వ్యాఖ్యానించారు. కానీ భారత్ అలా కాదని... భిన్న భాషలు, విభిన్న సంస్కృతులు కలిగిన రాష్ట్రాలు దేశంగా ఏర్పడ్డాయన్నారు. అందుకే ఇది దేశం కాదని... ఉపఖండం అని... ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందన్నారు. తనకు రాముడి పైనా... రామాయణం పైన విశ్వాసం లేదని కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

రాజా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. డీఎంకే నేతల నుంచి ఇలాంటి విద్వేష ప్రసంగాలు చూస్తూనే ఉన్నామని ధ్వజమెత్తింది. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు మరవకముందే రాజా ఇలా మాట్లాడటం దారుణమని పేర్కొంది. రాజా వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలు స్పందించాలని డిమాండ్ చేసింది. డీఎంకే నేతను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది.

రాజా చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో కాంగ్రెస్ కూడా స్పందించింది. ఆ వ్యాఖ్యలతో తాము వంద శాతం ఏకీభవించడం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ అన్నారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఎవరైనా ఏదైనా మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలన్నారు.
a raja
dmk
BJP
Tamil Nadu

More Telugu News