Kinjarapu Ram Mohan Naidu: 'జయహో బీసీ' సభలో రామ్మోహన్ నాయుడు పవర్ ఫుల్ స్పీచ్... వివరాలు ఇవిగో!

  • మంగళగిరి వద్ద జయహో బీసీ సభ
  • బీసీలు కష్టపడితేనే దేశం ముందుకు పోతోందన్న రామ్మోహన్ నాయుడు
  • జగన్ వచ్చాక అత్యధికంగా నష్టపోయింది బీసీలేనని వెల్లడి
  • బీసీలకు నమ్మకద్రోహం చేస్తే తొక్కిపట్టి నార తీస్తామని హెచ్చరిక 
Ram Mohan Naidu take a jibe at CM Jagan over BC issues

మంగళగిరి సమీపంలో నాగార్జున వర్సిటీ వద్ద టీడీపీ-జనసేన జయహో బీసీ సభ ప్రారంభమైంది. టీడీపీ యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. 

ప్రతి రోజు ఒక బీసీ సోదరుడు, సోదరీమణి కష్టపడితేనే ఈ దేశం ముందుకు నడుస్తుందని అన్నారు. బట్ట పరిశుభ్రం చేయాలన్నా బీసీ... జుట్టు సరిచేయాలన్నా బీసీ... గుడి తలుపులు తెరవాలన్నా బీసీ... బడిలో పాఠాలు చెప్పాలన్నా బీసీ... పొలం దున్నాలన్నా బీసీ... బలంతో బస్తా మోసే కళాసీ బీసీ... పంచభూతాలన్నింటి సాయంతో వృత్తులను ముందుకు నడుస్తున్నది బీసీలు అని వివరించారు. 

అలాంటి బీసీలం స్వాతంత్ర్యం వచ్చాక ఎంతోమందికి పల్లకీలు మోశాం... అలాంటి బీసీలను మొట్టమొదట పల్లకీ ఎక్కించింది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు అని రామ్మోహన్ నాయుడు తెలిపారు.

"1982లో ఏపీలో ఎక్కడ ఏ కులం ఉందో తెలియదు, ఎక్కడ బీసీలు ఉంటున్నారో తెలియదు... అటువంటి వారిని వెదికి వెదికి అటు పార్లమెంటుకు, ఇటు అసెంబ్లీకి పంపించిన ఘనత టీడీపీది. ఈ రోజు రామ్మోహన్ నాయుడు ఒక బీసీగా రెండు పర్యాయాలు పార్లమెంటుకు వెళ్లాడంటే అందుకు మొట్టమొదటి పునాది కింజరాపు ఎర్రన్నాయుడు వద్ద పడింది... ఆ పునాది వేసింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. 

బడుగు బలహీన వర్గాల వారికి కూడా అవకాశాలు కల్పిస్తూ తెలుగుదేశం పార్టీ ముందుకు నడిపిస్తోంది. బీసీల కోసం చంద్రబాబునాయుడు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. 2014 నుంచి 2019 వరకు విద్య పరంగా, ఉపాధి పరంగా కోట్ల రూపాయలతో అనేక పథకాలు తీసుకువచ్చారు. విదేశీ విద్య పథకం ద్వారా బీసీ కుటుంబాల వారు విదేశాల్లో చదువుకోవాలనుకుంటే ఆ అవకాశం చంద్రబాబు కల్పించారు. 

సుమారు రూ.3,700 కోట్ల మేర బీసీ కార్పొరేషన్ల ద్వారా లోన్లు అందించి, మనం ఎవరైనా ఆర్థికంగా బలపడాలి అనుకుంటే ఆ అవకాశం చంద్రబాబు కల్పించారు. ఆదరణ, తదితర పథకాలతో బీసీలకు చేయూతనిచ్చింది చంద్రబాబే. 

కానీ, ఒక్క అవకాశం అంటూ 2019లో ఈ దుర్మార్గుడు జగన్ అధికారంలోకి వచ్చాక అత్యధికంగా నష్టపోయింది బీసీలే. ఇవాళ బీసీలకు దేంట్లోనైనా న్యాయం జరుగుతోందా అనేది మనమందరం పరిశీలించుకోవాలి. రూ.74 వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధులను కూడా దారిమళ్లించిన దుర్మార్గుడు ఈ జగన్ మోహన్ రెడ్డి. బీసీలకు ఉద్దేశించిన అనేక పథకాలను ఆపేశాడు. 

బీసీలకు 57 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని బడాయి కొట్టుకుంటున్నాడు. కానీ, ఆ బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల వద్దకు బీసీ సోదరులు వెళితే కప్పు టీ ఇవ్వడానికి కూడా నిధులు లేని పరిస్థితి! ఇలాంటి కార్పొరేషన్లు ఇస్తే ఏంటి... ఇవ్వకపోతే ఏంటి? 

మన బీసీలం నమ్మితే ప్రాణం ఇస్తాం... అదే నమ్మకద్రోహం చేస్తే తొక్కిపట్టి నార తీస్తాం అని రేపటి ఎన్నికల్లో మనం నిరూపించాలి. ఆ చైతన్యం కోసమే ఇవాళ జయహో బీసీ సభ నిర్వహిస్తున్నాం. ఈ ముఖ్యమంత్రి మళ్లీ మాయమాటలు చెబుతూ ముందుకొస్తున్నాడు... నా బీసీ అంటున్నాడు. ఆ మాట అనే అర్హత ఆయనకు ఉందా? 

పార్లమెంటులో ప్యానల్  స్పీకర్ అయ్యే అవకాశం దక్కితే... లోక్ సభలో మిథున్ రెడ్డిని ప్యానల్ స్పీకర్ చేశారు. రాజ్యసభలో ప్యానల్ స్పీకర్ అవకాశం వస్తే విజయసాయిరెడ్డికి ఇచ్చారు. అదే అవకాశం టీడీపీకి వస్తే ప్యానల్ స్పీకర్ గా కాదు, ఏకంగా స్పీకర్ గానే దళితబిడ్డ బాలయోగిని కూర్చోబెట్టింది. అదీ టీడీపీ ఘనత. కేంద్ర మంత్రిగా అవకాశం వస్తే నాడు ఎర్రన్నాయుడు గారిని కేంద్రమంత్రిగా చేసింది కూడా టీడీపీనే. బీసీలకు ఏం చేశాడని జగన్ నా బీసీ అని చెప్పుకుంటాడు?" అంటూ రామ్మోహన్ నాయుడు ధ్వజమెత్తారు.

మళ్లీ రాష్ట్రం వైపు చూడకుండా జగన్ ను తరిమేయాల్సిన సమయం వచ్చింది: కాలవ శ్రీనివాసులు

మంగళగిరి వద్ద జయహో బీసీ సభలో టీడీపీ సీనియర్ నేత కాలవ శ్రీనివాసులు ప్రసంగించారు. సమాజంలో సగానికి పైగా బీసీలమే ఉన్నామని అన్నారు. బీసీ యువత భవిష్యత్తును జగన్ నాశనం చేశారని మండిపడ్డారు. మళ్లీ రాష్ట్రం వైపు చూడకుండా  జగన్ ను తరిమేయాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు అండగా నిలవాల్సిన అవసరం వచ్చిందని కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.

More Telugu News