balmoori venkat: కవితక్కా... చర్చకు నేను సిద్ధం... ధర్నా చౌక్‌కు రమ్మంటే వస్తా: బల్మూరి వెంకట్ సవాల్

  • జీవో నెంబర్ 3తో ఎవరికీ అన్యాయం జరగదన్న బల్మూరి వెంకట్
  • బీఆర్ఎస్ హయాంలో మహిళలు ఇబ్బందిపడితే కవిత ఎప్పుడూ మాట్లాడలేదని ఆరోపణ
  • మహిళలను, నిరుద్యోగులను ఎవరు మోసం చేశారో తేల్చుకుందాం రండి అంటూ సవాల్
Balmoori Venkat challenges Kavitha

కవితక్కా... జీవో నెంబర్ 3పై చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను... ధర్నా చౌక్‌కు రమ్మంటే వస్తానంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సవాల్ చేశారు. జీవో నెంబర్ 3తో మహిళలకు అన్యాయం జరుగుతోందని, దీనిని రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. 8న ధర్నా చౌక్‌లో నిరసన తెలుపుతామని ఆమె హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం అసెంబ్లీ మీడియా హాలులో బల్మూరి వెంకట్ స్పందించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ వస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు  న్యాయం చేస్తోందన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తున్నామని తెలిపారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు తాము అమలు చేస్తున్నప్పటికీ తమపై కుట్రపూరిత, అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

బీఆర్ఎస్ హయాంలో తొమ్మిదిన్నరేళ్లు మహిళలు ఇబ్బందిపడినా కవిత ఎప్పుడూ మాట్లాడలేదని ఆరోపించారు లీగల్ పాయింట్స్ అంటూ రోస్టర్ విధానాన్ని తెరపైకి తీసుకువచ్చి నిరుద్యోగులను కన్ఫ్యుజ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 3 వలన నిరుద్యోగులకు, మహిళలకు ఎలాంటి అన్యాయం జరగదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ మూడు రోజుల్లోనే టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేశామన్నారు.

జాబ్ క్యాలెండర్‌ను త్వరలో విడుదల చేస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు, మహిళలకు మీరేం చేశారో చర్చించేందుకు మేం సిద్ధమంటూ సవాల్ చేశారు. బీఆర్ఎస్‌లో మహిళ అంటే కవిత మాత్రమే కనిపించేదని... కానీ కాంగ్రెస్‌లో సీతక్క, కొండా సురేఖ, దీపా దాస్ మున్షీ ఇలా ఎంతోమంది కనిపిస్తున్నారన్నారు. జీవో నెంబర్ 3పై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని... బహిరంగ చర్చ కు రెడీ..మీ ఇష్టం ధర్నా చౌక్ కు రమ్మంటే వస్తానన్నారు. మహిళలను, నిరుద్యోగులను ఎవరు మోసం చేశారో తేల్చుకుందాం రండి అన్నారు.

నిరుద్యోగులను, మహిళలను తప్పుదోవ పట్టించవద్దని విజ్ఞప్తి చేశారు. మీ ప్రభుత్వం ధర్నా చౌక్‌ని ఎత్తివేసి కనీసం ప్రజా సమస్యలను తెలుసుకునే అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి సమస్య తెలుసుకొని... వాటి పరిష్కారం కోసం కృషి చేస్తోందన్నారు.

More Telugu News