Karnataka: విదానసౌధలో 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాల కేసు.. ముగ్గురి అరెస్ట్‌

Pro Pakistan Slogan case FSL Report Leads to arrest of three in Karnataka
  • కర్ణాటక విధాన సౌధలో గ‌త నెల 27న ఘ‌ట‌న‌
  • ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నివేదిక ఆధారంగా ముగ్గురి అరెస్టు  
  • పోలీసుల‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామ‌న్న హోంమంత్రి
గ‌త నెల 27న కర్ణాటక విధాన‌సౌధలో ఎమ్మెల్యేలు రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌లో ఓటు వేసిన సంద‌ర్భంగా 'పాకిస్థాన్ జిందాబాద్' అని నిన‌దించిన ముగ్గురిని తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన ముగ్గురిని ఢిల్లీకి చెందిన ఇల్తాజ్, బెంగళూరుకు చెందిన మునవర్, హవేరీకి చెందిన మహ్మద్ షఫీగా గుర్తించారు. 

కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి నాసిర్ హుస్సేన్ మద్దతుదారులైన ఈ ముగ్గురు తమ నాయకుడిని గెలిపించాలంటూ ఓటింగ్ స‌మ‌యంలో ఇలా నినాదాలు చేశారు. ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) నివేదిక, ఇతర ఆధారాలతో అరెస్టులు జరిగాయని బెంగళూరు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్) శేఖర్ వెల్ల‌డించారు. వారిని త్వ‌ర‌లోనే కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. 

‘‘ఫిబ్రవరి 27న విధానసౌధలో జరిగిన రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు చేయడంపై కేసు నమోదైంది. అనంతరం ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక, సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలం, లభ్యమైన సాక్ష్యాల ఆధారంగా ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశాం. అరెస్ట‌యిన‌ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని పోలీసులు మీడియాకు తెలియ‌జేశారు. 

మ‌రోవైపు ఈ కేసులో చర్య తీసుకునేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర చెప్పారు. ఈ కేసులో పోలీసులు తమ పని తాము చేసుకుపోయారని ఆయన అన్నారు. ఫ‌లితంగానే ఇవాళ ఈ అరెస్టులు జ‌రిగాయ‌ని చెప్పుకొచ్చారు.
Karnataka
Pro Pakistan Slogan
MLAs

More Telugu News