Vasantha Krishna Prasad: ఉమా, బొమ్మసాని కలవడం కాదు... వాళ్లిద్దరితో నేను కూడా కలుస్తా: వసంత కృష్ణప్రసాద్

  • ఆసక్తికరంగా మైలవరం రాజకీయాలు
  • వైసీపీని వీడి టీడీపీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
  • చేయి కలిపిన దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు
  • ఎవరికి టికెట్ వచ్చినా కలిసి పనిచేస్తామన్న వసంత కృష్ణప్రసాద్ 
  • తనను విమర్శిస్తే మాత్రం తగిన సమాధానం చెబుతానని స్పష్టీకరణ
Vasantha Krishna Prasad comments on Mylavaram politics

ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలు టీడీపీకి తలనొప్పిగా మారనున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి రావడంతో స్థానిక రాజకీయాలు వేడెక్కాయి. వసంత టీడీపీలో చేరిన అనంతరం... ఇప్పటిదాకా రెండు వర్గాలుగా ఉన్న దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు కలిసి పోయారు. వరుసగా సమావేశాలు పెడుతూ మైలవరం రాజకీయాలను ఆసక్తికరంగా మార్చారు. దీనిపై వసంత కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడారు. 

వారు సమావేశాలు పెట్టుకుంటుండడం, కార్యక్రమాలు నిర్వహిస్తుండడం వారికి సంబంధించిన విషయం అని, వారి ఉద్దేశం ఏంటో తనకు తెలియదని అన్నారు. పార్టీలో నీ కార్యక్రమాలు నువ్వు కొనసాగించు, నాయకులందరినీ కలువు, ఎక్కడ కార్యక్రమాలు జరిగినా హాజరవుతుండు అని చంద్రబాబు తనతో చెప్పారని వసంత కృష్ణప్రసాద్ వెల్లడించారు. 

వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పార్టీ పరంగా తాను సానుకూల దృక్పథంతోనే ముందుకెళతానని, తన పని తాను చేసుకెళతానని స్పష్టం చేశారు. ఎవరు ఏ కోణంలో వెళ్లినా, చివరికి అందరూ ఒక చోటికే, ఒక దారికే రావాల్సి ఉంటుందని, అదే జరుగుతుందని అనుకుంటున్నానని చెప్పారు. 

తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారు పేరు... ఆ పార్టీలో  రెండున్నర దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యక్తి కొన్ని రోజుల తర్వాతైనా కలిసి పార్టీ లైన్లోకి వస్తారని ఆశిస్తున్నానని వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఇక్కడ ఎవరెవరు సమావేశాలు పెట్టుకుంటున్నారన్న విషయం పార్టీ అధిష్ఠానం దృష్టిలో ఉందని, దీనిపై పార్టీ ఏం చెబితే అది చేస్తానని స్పష్టం చేశారు. 

వారు చేస్తున్నది పార్టీ కార్యక్రమాలైతే స్వాగతించాల్సిందే... ఆ సమావేశాల్లో  నన్ను పరోక్షంగా గానీ, ప్రత్యక్షంగా గానీ విమర్శిస్తే తగిన విధంగా సమాధానం చెబుతాను... నియోజకవర్గంలో సమన్వయంతో వ్యవహరించడంలో పార్టీ  చెప్పిన మేరకు నడుచుకుంటానని వసంత కృష్ణప్రసాద్ వెల్లడించారు. 

బొమ్మసాని సుబ్బారావు తనకు అన్న అని, పెద్దవాళ్ల హయాం నుంచి తాము కలిసే ఉన్నామని చెప్పారు. ఉమా గారు, బొమ్మసాని కలవడం కాదు... వాళ్లతో నేను కూడా కలుస్తాను... ముగ్గురం కలిసి కృషి చేద్దాం... ఎవరికి టికెట్ వచ్చినా కలిసి పనిచేద్దాం అనేది నా నినాదం అని వసంత కృష్ణప్రసాద్ వివరించారు. 

"ఉమా గారికి టికెట్ వచ్చినా నేను ఆయన కోసం పనిచేస్తాను, నా వాళ్లతోనూ ఆయన కోసం పనిచేయిస్తాను... అందులో సందేహం లేదు. పార్టీ నిర్ణయమే నాకు శిరోధార్యం... పార్టీ ఏం చెబితే అందుకు కట్టుబడి ఉంటాను" అని వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.

More Telugu News