Modi Sangareddy: దక్షిణ భారతానికి తెలంగాణ రాష్ట్రమే గేట్ వే: ప్రధాని మోదీ

  • సంగారెడ్డిలో మోదీ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  • పటేల్ గూడా సభ వేదిక పైకి మోదీని పూల రథంలో ఆహ్వానించిన బీజేపీ శ్రేణులు
  • మేమే మోదీ కుటుంబం అంటూ తెలుగులో మాట్లాడిన ప్రధాని
PM Modi Speech At Sangareddy

దక్షిణ భారత దేశానికి తెలంగాణ రాష్ట్రమే గేట్ వే అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం రాష్ట్రానికి వచ్చిన ప్రధాని.. మంగళవారం సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పటేల్ గూడాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సభావేదికపైకి మోదీని బీజేపీ నేతలు పూల రథంలో ఆహ్వానించారు. ఓపెన్ టాప్ జీప్ ను పూలదండలతో అలంకరించి మోదీని అందులో తోడ్కొని వెళ్లారు. ప్రధాని మోదీతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కిషన్ రెడ్డి వాహనంలో వేదికపైకి చేరుకున్నారు. బీజేపీ కార్యకర్తలు మోదీపై పూల వర్షం కురిపించారు.

ఈ సభలో మోదీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలతో రెండో రోజు కూడా ఉండడం సంతోషంగా ఉందని చెప్పారు. సంగారెడ్డిలో రూ.9 వేల కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించామని, దేశంలోనే తొలి సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ ను బేగంపేటలో ప్రారంభించామని చెప్పారు. దీంతో ఏవియేషన్ రంగంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అన్నారు. పదేళ్లలో దేశంలో ఎయిర్ పోర్టుల సంఖ్య రెట్టింపు చేశామని తెలిపారాయన.

ఘట్ కేసర్ - లింగంపల్లి మధ్య ప్రారంభించిన ఎంఎంటీఎస్ రైళ్లతో కనెక్టివిటీ పెరుగుతుందని చెప్పారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని తమ ప్రభుత్వం నమ్ముతుందని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా తనకు కుటుంబం లేదంటూ ఇండియా కూటమి నేత లాలూ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై మోదీ విమర్శలు గుప్పించారు. 140 కోట్లకు పైగా ఉన్న భారతీయులంతా తన పరివారమే (కుటుంబమే) అని చెప్పారు. ‘మేమే మోదీ కుటుంబం’ అని తెలుగులో చెబుతూ సభకు హాజరైన జనంతో తిరిగి చెప్పించారు.

మహంకాళీ ఆలయ సందర్శన
మంగళవారం ఉదయం సికింద్రాబాద్ లోని ఉజ్జయినీ మహంకాళి ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. ఆలయ పూజారులు, అధికారులు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం చేయించి, ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి వస్త్రం, ఫొటో ఫ్రేమ్, తీర్థప్రసాదాలను మోదీకి అందజేశారు.

More Telugu News