Record Break Movie: ’రికార్డ్ బ్రేక్’ చేసేందుకు సిద్ధమైన జయసుధ తనయుడు నిహార్ కపూర్

  • ఈ నెల 8న పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ‘రికార్డ్ బ్రేక్’ సినిమా
  • కుస్తీ పోటీల నేపథ్యంగా సాగే సినిమా
  • దంగల్‌కు, ఈ సినిమాకు పొంతన ఉండదన్న నిహార్
  • ప్రతీ భారతీయుడు చూసి తీరాల్సిన దేశభక్తి సినిమా అంటూ కితాబు
  • 8 భాషల్లో వస్తున్న మూవీ
  • ట్రైలర్ చూసి అమ్మ జయసుధ మెచ్చుకున్నారన్న నిహార్ కపూర్
Nihar Kapoor Movie Record Break Releasing On March 8th Special Interview With Nihar

పాన్ ఇండియా మూవీ ‘రికార్డ్ బ్రేక్’తో ఈ నెల 8న ఆడియన్స్ ముందుకొస్తున్నారు సీనియర్ నటి జయసుధ తనయుడు నిహార్ కపూర్. ఈ నేపథ్యంలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను ఆయన పంచుకున్నారు. తాను గ్యాంగ్‌స్టర్ గంగరాజు సినిమా చేస్తున్నప్పుడు చదలవాడ శ్రీనివాసరావు ఓ కథ చెబితే చాలా ఎక్సైటింగ్‌గా అనిపించిందన్నారు. అడవిలో పెరుగుతున్న ఇద్దరు అనాథ ట్విన్స్ కుస్తీ పోటీలు నేర్చుకుని నగరానికి వచ్చి అంతర్జాతీయస్థాయికి చేరుకునే స్థాయికి వెళ్లడం వరకు చాలా అద్భుతంగా ఈ సినిమాలో చూపించారని పేర్కొన్నారు. 

ఆమిర్‌ఖాన్ సినిమా ‘దంగల్’కు, ఈ ‘రికార్డు బ్రేక్’ సినిమాకు పొంతన ఉండదని నిహార్ చెప్పుకొచ్చారు. అడవి నుంచి అంతర్జాతీయస్థాయి వరకు సాగిన అనాథల జర్నీలో సెంటిమెంట్, ఎమోషన్ అన్నీ కలిసి ఓ కమర్షియల్‌గా ఉంటుందని, మదర్ సెంటిమెంట్‌తోపాటు సాంగ్స్, ఫైట్స్ అన్నీ ఆకట్టుకునేలా ఉంటాయని వివరించారు. వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్న ఈ సినిమా కాన్సెప్ట్ ప్రెజెంటేషన్ నేటి జనరేషన్‌కు నచ్చుతుందా? అన్న ప్రశ్నకు నిహార్ బదులిస్తూ.. ఇది తెలుగు సినిమా అయినా ప్రతీ భారతీయుడు చూసి గర్వించదగ్గ సినిమా అని పేర్కొన్నారు. అందుకనే దీనిని ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు. 

ఇది పూర్తిగా దేశభక్తి సినిమా అని, చదలవాడ శ్రీనివాసరావు చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా చేశారని పేర్కొన్నారు. యాక్షన్ సీక్వెన్స్‌ను జాషువా చేస్తున్నారని, ప్రతి యాక్షన్ ఎపిసోడ్ కొత్తగా, అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నారు. సినిమాలో హీరోయిన్ కన్నా క్యారెక్టరేజేషన్‌ను ఎక్కువగా చూపించారని తెలిపారు. సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని, అమ్మ జయసుధకు బాగా నచ్చిందని నిహార్ చెప్పుకొచ్చారు. అమ్మ బిజీగా ఉండడంతో కథ విని తానే ఓకే చేశానని, ఆ తర్వాత అమ్మకు చెబితే యూనిక్ కాన్సెప్ట్ తీసుకున్నానని మెచ్చుకున్నారని అన్నారు. భవిష్యత్తులో కచ్చితంగా డైరెక్షన్ చేస్తానని పేర్కొన్న నిహార్.. ఓటీటీ ఫీచర్ ఫిలిమ్స్ కోసం రెండింటికి ట్రై చేస్తున్నట్టు చెప్పారు.

More Telugu News