China: భారత్‌తో వివాదం నేపథ్యంలో.. మాల్దీవులు- చైనా మధ్య కుదిరిన కీలక ఒప్పందం

  • రక్షణ సహకారం కోసం చైనాతో మాల్దీవుల అగ్రిమెంట్.. సంతకం చేసిన ఇరుదేశాలు
  • భారత సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని అధ్యక్షుడు మహ్మద్ నుయిజ్జి ఆదేశాల నేపథ్యంలో కీలక పరిణామం
  • మే 10 నాటికి మాల్దీవులను ఖాళీ చేయనున్న 88 మంది భారత సైనిక బృందం
Maldives to get Free Military Assistance From China Amid Row With India

భారత్‌తో వివాదం నేపథ్యంలో మాల్దీవులు కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత సైనిక సహాయం కోసం చైనాతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు ద్వైపాక్షిక రక్షణ సహకార ఒప్పందంపై ఇరుదేశాలు సోమవారం సంతకాలు చేశాయి. భారత సైనిక సిబ్బందిని తమ దేశం నుంచి ఉపసంహరించుకోవాలంటూ మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు గడువు విధించిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. మాల్దీవుల రక్షణ మంత్రి మొహమ్మద్ ఘసన్ మౌమూన్, చైనా సైనిక సహకార కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ మేజర్ జనరల్ జాంగ్ బావోక్న్‌ సోమవారం సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య రక్షణ సహకారంపై చర్చించారు. ఈ విషయాన్ని మొహ్మమ్మద్ మౌమూన్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. మాల్దీవులకు చైనా సైనిక సహాయంపై ఒప్పందం కుదిరిందని, బలమైన ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడానికి చైనా అంగీకరించిందని తెలిపారు. కాగా ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను బహిర్గతం చేయలేదు.

ఇదిలావుంచితే మాల్దీవులకు చైనా 12 పర్యావరణహితమైన అంబులెన్స్‌లను బహుమతిగా అందించిందని మీడియా కథనాలు తెలిపాయి. గత ఆదివారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాల్దీవులలోని చైనా రాయబారి వాంగ్ లిక్సిన్ ఈ అంబులెన్స్‌లను అందించారని పేర్కొన్నాయి. 

మరోవైపు మాల్దీవుల నుంచి మొదటి విడత సైనిక సిబ్బంది ఉపసంహరణ గడువు మార్చి 10గా ఉందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఫిబ్రవరి 29న మీడియాకు వెల్లడించారు. మే 10 నాటికి పూర్తిగా ఉపసహరణ జరుగుతుందని వివరించారు. కాగా మాల్దీవుల ప్రభుత్వ లెక్కల ప్రకారం 88 మంది భారతీయ సైనిక సిబ్బంది ఆ దేశంలో ఉన్నారు. ప్రధానంగా 2 హెలికాప్టర్లు, ఒక విమానాన్ని ఈ సిబ్బంది నిర్వహిస్తున్నారు. అత్యవసర వైద్య తరలింపులు, సహాయక కార్యక్రమాల్లో వీటిని ఆపరేట్ చేస్తున్నారు.

More Telugu News