HMDA: హెచ్‌ఎండీఏ పరిధిలోని భూములపై ఆన్‌లైన్‌ ద్వారా పర్యవేక్షణ.. సిద్ధమవుతున్న ప్రణాళిక

  • మరింత పకడ్బందీ భూముల పరిరక్షణపై దృష్టిసారించిన హెచ్ఎండీఏ
  • జీపీఎస్‌ మ్యాపింగ్‌, జియోట్యాగ్‌‌ల ద్వారా పర్యవేక్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికారులు
  • సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఖాళీ స్థలాల వివరాలను సేకరించిన అధికారులు
GHMC Planing to Online monitoring on lands under HMDA

ఆక్రమణదారుల నుంచి భూముల పరిరక్షణ, భూరికార్డులను మరింత పకడ్బందీగా నిర్వహించడమే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అడుగులు వేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు ఇవ్వడంతో భూములు ఆక్రమణలకు గురికాకుండా అధికారులు పటిష్ఠమైన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జీపీఎస్‌ మ్యాపింగ్‌, జియోట్యాగ్‌ లాంటి సాంకేతిక విధానాల ద్వారా హెచ్ఎండీఏ పరిధిలోని అన్ని ఖాళీ స్థలాలపై పర్యవేక్షణ ఉండాలని అధికారులు యోచిస్తున్నారు. జీపీఎస్‌, జియోట్యాగ్‌లతో ఎప్పటికప్పుడు ఆయా భూములకు సంబంధించిన ఆక్రమణలు ఆఫీస్ నుంచే ఆన్‌లైన్‌లో గమనించే వీలు కలుగుతుంది.

ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ఏడు జిల్లాల పరిధిలోని భూముల వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 10 వేల ఎకరాల భూమిని గుర్తించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, మెదక్‌, సంగారెడ్డి, భువనగిరి, సిద్ధిపేట జిల్లాల్లో హెచ్‌ఎండీఏకు విలువైన భూములు ఉన్నాయని తేలింది. కాగా కొన్నేళ్లుగా భూముల ఆక్రమణ ఎక్కువైపోయింది. అధికారులకు సమాచారం అంది స్పందించి చర్యలు తీసుకునేలోపే ఆక్రమణదారులు కోర్టుల నుంచి స్టేలు తీసుకొచ్చి ఆటంకాలు సృష్టిస్తున్నారు. దీంతో అధునాతన సాంకేతిక విధానాల ద్వారా ఎప్పటికప్పుడు భూఆక్రమణలను గర్తించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

కాగా హెచ్ఎండీఏ పరిధిలోని విలువైన భూముల రక్షణతో ప్రభుత్వ అవసరాలతో పాటు పరిశ్రమలు, కంపెనీల ఏర్పాటుకు అవకాశాలు ఉంటాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొన్ని భూములను ఆన్‌లైన్‌లో వేలం వేయగా కోకాపేట, బుద్వేల్‌ లాంటి ప్రాంతాల్లో భూములు వందల కోట్ల ధర పలికిన విషయం తెలిసిందే.

More Telugu News