palla rajeswar reddy: ఆదిలాబాద్ వేదికగా కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందం బయటపడింది: పల్లా రాజేశ్వర్ రెడ్డి

  • ఈ సంబంధాలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బహిర్గతం కాలేదని, ఇప్పుడు బయటకే కనిపిస్తున్నాయన్న పల్లా
  • గుజరాత్ మోడల్‌ను సీఎం రేవంత్ రెడ్డి అంగీకరిస్తే రాహుల్ గాంధీతో విభేదిస్తున్నట్లేనని వ్యాఖ్య
  • అదానీని వద్దు అని రాహుల్ గాంధీ చెబుతుంటే... అదానీ ముద్దు అని రేవంత్ రెడ్డి అంటున్నారని చురక
Palla Rajeswar Reddy fires at congress and bjp

ఆదిలాబాద్ సభ వేదికగా కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందం బయటపడిందని బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీని పెద్దన్న అంటే, ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డిని చిన్నతమ్ముడు అని పరస్పరం పొగుడుకున్నారని గుర్తు చేశారు. ఈ బడేబాయ్... చోటేబాయ్ సంబంధాలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బహిర్గతం కాలేదని, ఇప్పుడు బయటకే కనిపిస్తున్నాయన్నారు.

ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి మాటలు, వారి ముఖ కవళికలు చూస్తుంటే ఆ రెండు పార్టీల చీకటి ఒప్పందం బయటపడినట్లుగా కనిపిస్తోందన్నారు. 

తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇద్దరి పేర్లను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తే గవర్నర్ తమిళిసై ఆ ఫైలును తిప్పి పంపించారని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక వారు సూచించిన పేర్లపై సంతకాలు చేశారని ఆరోపించారు. ఇది కూడా ఆ రెండు పార్టీల చీకటి ఒప్పందానికి నిదర్శనమన్నారు.

గుజరాత్ మోడల్‌ను, గుజరాత్ అభివృద్ధిని సీఎం రేవంత్ రెడ్డి అంగీకరిస్తే కనుక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బీజేపీ విధానాలకు సహకరిస్తున్నట్లేనని... మోదీ ముందు మోకరిల్లుతున్నట్లే అన్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీతో, కాంగ్రెస్‌తో తెలంగాణ కాంగ్రెస్ విభేదిస్తున్నట్లే అన్నారు. ఎందుకంటే గుజరాత్ ఫెయిల్యూర్ మోడల్ అని రాహుల్ గాంధీ అంటుంటే... తనకు గుజరాత్ మోడల్ కావాలని రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరమన్నారు. అదానీని వద్దు అని రాహుల్ గాంధీ చెబుతుంటే... అదానీ తనకు ముద్దు అని రేవంత్ రెడ్డి అంటున్నారని విమర్శించారు. 

More Telugu News