nama nageswara rao: రాహుల్ గాంధీ సహా ఎవరు వచ్చినా ఖమ్మంలో ఎదుర్కొంటా: నామా నాగేశ్వర రావు

  • అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ప్రతికూలంగా వచ్చినప్పటికీ లోక్ సభలో అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని ధీమా
  • మరోసారి పోటీ చేసే అవకాశం కల్పించినందుకు పార్టీ అధినేతకు నామా ధన్యవాదాలు
  • గెలుపోటములు ముఖ్యం కాదని, ప్రజాసేవ ముఖ్యమని వ్యాఖ్య
  • భద్రాచలం ఎమ్మెల్యే అనారోగ్యం కారణంగా సమావేశానికి హాజరు కాలేదన్న కవిత
Nama Nageswara Rao ready to fight in Khammam

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సహా ఎవరు వచ్చినా ఎదుర్కొంటానని బీఆర్ఎస్ నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు నాలుగు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఖమ్మం నుంచి నామా, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవితకు మళ్లీ అవకాశం ఇచ్చారు.

ఈ నేపథ్యంలో నామా నాగేశ్వర రావు మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ప్రతికూలంగా వచ్చినప్పటికీ లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుంటామన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు బీఆర్ఎస్‌కే సానుకూలంగా ఉన్నాయన్నారు. మరోసారి పోటీ చేసే అవకాశం కల్పించినందుకు పార్టీ అధినేతకు ధన్యవాదాలు తెలిపారు. తాను పాతికేళ్లుగా ప్రజాసేవలో ఉన్నానని... ఖమ్మం నుంచి ఎవరు పోటీ చేసినా తాను ఎదుర్కొంటానన్నారు. గెలుపోటములు ముఖ్యం కాదని, ప్రజాసేవ ముఖ్యమన్నారు. 

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశామన్న భావన ప్రస్తుతం ప్రజల్లో కనిపిస్తోందని మాలోత్ కవిత అన్నారు. గిరిజనులకు బీఆర్ఎస్ అండగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు కరెంట్, విద్యుత్ సమస్య మళ్లీ ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం తాము లోక్ సభలో కొట్లాడామన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అనారోగ్యం కారణంగా సమావేశానికి హాజరు కాలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు అవకాశం రాలేదని, బీఆర్ఎస్‌లో ఉన్నందువల్లే ఎమ్మెల్యే అయ్యారన్నారు. మహబూబాబాద్‌లో పార్టీకి చెందిన వారంతా తనకు సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

More Telugu News