Chandrababu: టీడీపీ వచ్చినా వాలంటీరు వ్యవస్థ ఉంటుంది... వైసీపీ కోసం మాత్రం పనిచేయవద్దు: చంద్రబాబు

  • పెనుకొండలో రా కదలిరా సభ
  • హాజరైన చంద్రబాబు
  • వాలంటీర్లను ఎవరినీ ఉద్యోగాల్లోంచి తీసేయబోమని హామీ
  • వాలంటీర్లకు మంచి భవిష్యత్ ఉంటుందని వెల్లడి
Chandrababu assures volunteers no job removals if TDP get into power

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పెనుకొండ 'రా కదలిరా' సభలో వాలంటీర్ల ప్రస్తావన తీసుకువచ్చారు. టీడీపీ హయాంలో యువతకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఈ ఐదేళ్ల పాలనలో ఉద్యోగాల కల్పన ఎలా ఉంది? అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? నేను ఐటీ ఉద్యోగాలు ఇస్తే, జగన్ వాలంటీరు ఉద్యోగాలు ఇచ్చారు అంటూ చంద్రబాబు విమర్శించారు. 

టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చినా వాలంటీరు వ్యవస్థ ఉంటుందని, ఎవరినీ ఉద్యోగం నుంచి తొలగించబోమని స్పష్టం చేశారు. అయితే, వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేయవద్దని కోరుతున్నా అని అన్నారు. వాలంటీర్లకు మంచి భవిష్యత్ ఉంటుందని, వారికి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 

నాకు ఇష్టమైన ప్రాంతం అనంతపురం

అనంతపురం జిల్లా అంటే నాకు ఎంతో ఇష్టం. అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లా ఇది. అలాంటి అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేయాలని సంకల్పించాం. కియా పరిశ్రమను తెచ్చి వేలాది మందికి ఉపాధి కల్పించాం. కియా కోసం గొల్లపల్లి రిజర్వాయర్ ను 18 నెలల్లో పూర్తి చేసిన నీరు అందించాం. 

2014లో పెనుకొండ ప్రాంతం ఎలా ఉంది... ఇప్పుడెలా ఉంది? కియా వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. అనంతపురం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చాం. సాగునీరు ఇస్తే చాలు... రాయలసీమ రైతులు బంగారం పండిస్తారు. అనంతపురం జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ రావాలి, తుంపర్ల సేద్యం రావాలి... తద్వారా రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. 

త్యాగాలకు నేను, పవన్ కల్యాణ్ సిద్ధం

టీడీపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ వేధిస్తున్నారు. ఖబడ్దార్... జాగ్రత్తగా ఉండండి. దెబ్బకు దెబ్బ... మంచికి మంచి. తమాషా అనుకోవద్దు. నాడు అనంతపురం జిల్లాలో రక్తం పారించారు... నేను వచ్చిన నీళ్లు పారించాను. రాష్ట్రాన్ని మళ్లీ నాశనం చేయాలనుకుంటున్నారు... ఇది మీ వల్ల కాదు. రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మేం తీసుకుంటున్నాం. ప్రజల తరఫున నాయకులుగా నేను, పవన్ కల్యాణ్ ముందుకెళతాం. ఎలాంటి త్యాగాలకైనా మేం సిద్ధం... మీరు సిద్ధమా?

అందుకే సూపర్ సిక్స్ తీసుకువచ్చాం

జగన్ రాష్ట్రాన్ని మూడు ముక్కలాట పేరుతో నాశనం చేశాడు. అందుకే సూపర్ సిక్స్ తీసుకువచ్చాం. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదరికం నిర్మూలన చేయడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళలకు, రైతులకు, యువతకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు న్యాయం చేసి, రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతిపథంలో నడిపించే బాధ్యత మాది. 

అందుకే ఇక్కడ సబితను నిలబెడుతున్నాం

పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఉన్నాడు. అతడి సీటు అనంతపురానికి బదిలీ అయింది. కల్యాణదుర్గంను సర్వం దోచేసుకున్న ఇంకో మంత్రి ఇక్కడికి వచ్చింది. సొంత నియోజకవర్గంలో గెలవలేరు కానీ, మరో చోటికి వెళ్లి గెలుస్తారంట! అక్కడ చెత్త ఇక్కడ బంగారం అవుతుందా? ఎక్కడైనా చెత్త చెత్తే అవుతుంది. అందుకే ఇక్కడ సబితను అభ్యర్థిగా నిలబెడుతున్నాం. ఇక్కడి ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని తమ్ముళ్లకు అప్పజెప్పి వందల ఎకరాలు దోచేశాడు. పెన్నా నది నుంచి బెంగళూరుకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. అలాంటి ఎమ్మెల్యే పోయాడు కానీ... ఇంకొక ఆవిడ వచ్చింది... ఆయన కంటే భయంకరమైన వ్యక్తి. 

తోపుదుర్తి వాటిలోనే తోపు... అభివృద్ధిలో కాదు!

రాప్తాడు ఎమ్మెల్యే ఒకాయన ఉన్నాడు... తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి. దౌర్జన్యాలు, దోపిడీల్లో మాత్రమే తోపు... అభివృద్ధిలో కాదు. లే అవుట్ వేయాలంటే కప్పం కట్టాలి... పనులు జరగాలంటే కమీషన్ ఇవ్వాలి. చెన్నే కొత్తపల్లిలో ఓ రైతు భూమి అమ్మలేదని మామిడి చెట్లను నరికించిన నరహంతకుడు ఈ తోపు. నా దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి... నీ అకౌంట్లు సెటిల్ చేస్తా... జాగ్రత్తగా ఉండు తోపు!

ధర్మవరాన్ని పీడిస్తున్న కేటుగాడు!

ధర్మవరంలో మరొకాయన ఉన్నాడు... ఆయనొక కేటుగాడు... పేరు కేతిరెడ్డి. గుడ్ మాణింగ్ అంటే జ్ఞాపకం వచ్చేది ఎవరు...? సోషల్ మీడియాలో ఈయనొక కాగితం పులి... నిద్రలేస్తే గుడ్ మాణింగ్! లోపల ఏం చేస్తాడో తెలియదు! పట్టణాన్ని ఆనుకుని ఉన్న ఎర్రగుట్టను మింగేశాడు. ఉదయం నిద్రలేచిన దగ్గర్నుంచి ఆ ఫాంహౌస్ లో ఏం జరుగుతోందో తెలుసా... గుర్రపుస్వారీ. ఆయన గుర్రంపై ప్రజల్లోకి వస్తున్నాడు. ఇలాంటి కేటుగాళ్లు ఉంటే ఏమవుతుంది తమ్మళ్లూ!

More Telugu News