Tamil Nadu: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు మందలింపు.. కీలక వ్యాఖ్యలు

SC rebukes Tamil Nadu Minister Udhayanidhi Stalin over eradicate Sanatan dharma remark

  • వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛ హక్కులను దుర్వినియోగపరిచారని మండిపాటు
  • ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఆలోచించుకోవాలని సూచన
  • వేర్వేరు రాష్ట్రాల్లో దాఖలైన కేసులన్నింటినీ ఏకమొత్తంగా విచారించాలంటూ ఉదయనిధి దాఖలు చేసిన పిటిషన్‌పై కీలక వ్యాఖ్యలు
  • సంబంధిత హైకోర్టులకు వెళ్లాలని సూచన
  • పలు కేసుల్లో తీర్పులు, విచారణ పురోగతిపై మార్చి 15న తిరిగి విచారణ చేపడతామని వెల్లడి

సనాతన ధర్మం కోవిడ్, మలేరియా, డెంగ్యూ లాంటిదని, దీనిని నిర్మూలించాలంటూ వ్యాఖ్యానించిన తమిళనాడు మంత్రి, డీఎంకే కీలక నేత ఉదయనిధి స్టాలిన్‌ను సుప్రీంకోర్టు గట్టిగా మందలించింది. వాక్ స్వాతంత్య్రాన్ని, భావప్రకటన స్వేచ్ఛ హక్కులను దుర్వినియోగపరిచారని మండిపడింది. తనపై నమోదైన కేసులన్నింటినీ ఏకమొత్తంగా ఒకేసారి విచారించాలంటూ ఎందుకు పిటిషన్ దాఖలు చేశారంటూ ఉదయనిధి స్టాలిన్‌ను సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. 

సనాతన ధర్మంపై వ్యాఖ్యల వివాదానికి సంబంధించి ఆరుకి పైగా రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయని, వాటన్నింటినీ ఏకం చేసి ఒకేసారి విచారణ జరిపేందుకు ఆదేశాలు ఇవ్వాలంటూ ఉదయనిధి స్థాలిన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం (నేడు) పరిశీలించింది. దీనిపై సంబంధిత హైకోర్టులను ఆశ్రయించాలని ఈ సందర్భంగా కోర్టు సూచించింది. కొన్ని ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించిన తీర్పులు, విచారణ పురోగతిపై మార్చి 15న తిరిగి విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

మంత్రిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఆలోచించాలని, ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని జస్టిస్‌ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన బెంచ్ ఉదయనిధి స్టాలిన్‌ను హెచ్చరించింది. ‘‘ మీరు రాజ్యాంగంలోని వాక్ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ హక్కును దుర్వినియోగం చేశారు. ఆర్టికల్ 25 కింద లభించిన మతస్వేచ్ఛను కూడా ఉల్లంఘించారు. ఇప్పుడేమో ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టులో నేరుగా పిటిషన్ దాఖలు చేసే హక్కును ఉపయోగిస్తున్నారా? మీరు చేసిన వ్యాఖ్యల పర్యవసానాలు మీకు తెలియవా? మీరు సామాన్య వ్యక్తి కాదు. మంత్రిగా ఉన్నారు. ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో తెలుసుకోవాలి’’ అని బెంచ్ వ్యాఖ్యానించింది.

తన క్లయింట్ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను సమర్థించడం లేదని, వేర్వేరు రాష్ట్రాల్లో అతడిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఏకమొత్తంగా ఒకేసారి విచారణ జరపాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ మను సింగ్వి అన్నారు. స్పందించిన కోర్టు హైకోర్టులను ఆశ్రయించాలని సూచించింది. కాగా గతేడాది సెప్టెంబర్ 2న ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సనాతన ధర్మాన్ని కోవిడ్, మలేరియా, డెంగ్యూలతో ఆయన పోల్చారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది.

  • Loading...

More Telugu News