Jayaho BC: రేపు టీడీపీ-జనసేన 'జయహో బీసీ' సభ... హాజరుకానున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్

  • బీసీల అభ్యున్నతి కోసం బీసీ డిక్లరేషన్
  • రేపు నాగార్జున యూనివర్సిటీ వద్ద జయహో బీసీ సభ
  • డిక్లరేషన్ విడుదల చేయనున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్
Chandrababu and Pawan Kalyan will attend Jayaho BC meeting tomorrow

జనాభాలో సగానికి పైగా ఉండే వెనుకబడిన తరగతుల వారి సమగ్రాభివృద్ధికి నేటి తరుణంలో చేపట్టవలసిన చర్యలతో టీడీపీ-జనసేన కూటమి బీసీ డిక్లరేషన్ రూపొందించింది. రేపు (మార్చి 5) మంగళవారం నాడు ‘బీసీ డిక్లరేషన్’ను కూటమి విడుదల చేయనుంది. 

దీనికోసం ‘జయహో బీసీ’ సదస్సును గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, టీడీపీ బీసీ సాధికార కమిటీ ఛైర్మన్ కొల్లు రవీంద్రతో పాటు రెండు పార్టీలకు చెందిన అగ్ర నాయకులు, కార్యకర్తలు సదస్సులో పాల్గొంటారు.

రేపు విడుదల చేయనున్న ‘బీసీ డిక్లరేషన్’ కు సంబంధించిన వివిధ అంశాలను చర్చించేందుకు ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయంలో యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దాదాపు 3 గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, దువ్వారపు రామారావు, పంచుమర్తి అనురాధ, కాల్వ శ్రీనివాసులు, బీద రవిచంద్రయాదవ్, వీరంకి గురుమూర్తి, జనసేన నాయకులు పోతిన మహేశ్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఇతర నాయకులు, వివిధ  బీసీ కులాల ప్రతినిధులు పాల్గొన్నారు.

చంద్రబాబు, పవన్ బీసీ డిక్లరేషన్ ను విడుదల చేస్తారు: అచ్చెన్నాయుడు

టీడీపీ ఆవిర్బావం నుంచి బీసీలు పార్టీకి బలమైన మద్దతుదారులుగా నిలబడ్డారని, వారి ఉన్నతి కోసం టీడీపీ ప్రభుత్వాలు పలు చర్యలు చేపట్టాయని, నేటి తరుణంలో బీసీల సమగ్రాభివృద్ధి కోసం చేపట్టాల్సిన నిర్దిష్ట విధానాలు, చర్యలతో ఒక సమగ్ర బీసీ డిక్లరేషన్ ను మంగళవారం నాడు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లు విడుదల చేస్తారని అచ్చెన్నాయుడు తెలిపారు. విస్తృత చర్చల ఆధారంగా ఈ డిక్లరేషన్ ను రూపొందించామని ఆయన అన్నారు. ‘జయహో బీసీ’ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 

డిక్లరేషన్ అంశాలు...
 
రేపు విడుదల కానున్న బీసీ డిక్లరేషన్ లో... బీసీల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో చేపట్టాల్సిన అంశాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో అమలు చేయాల్సిన నిర్ణయాలు, వివిధ బీసీ కులాలవారీగా అందించాల్సిన మద్దతుకు సంబంధించిన వివరాలుంటాయని టీడీపీ బీసీ సాధికారత కమిటీ ఛైర్మన్ కొల్లు రవీంద్ర తెలిపారు.

More Telugu News