BJP: 'మోదీ కా పరివార్': తమది మోదీ కుటుంబమంటూ బయో మార్చుకున్న బండి సంజయ్, కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్

  • మోదీకి కుటుంబం లేదని తీవ్ర విమర్శలు చేసిన లాలూ ప్రసాద్ యాదవ్
  • ఎక్స్ బయోలో పేరు పక్కన 'మోదీ కా పరివార్' అంటూ జత చేసుకున్న బీజేపీ అగ్ర నాయకులు
  • నేనూ మోదీ కుటుంబ సభ్యుడినే అంటూ ఎక్స్‌లో ట్రెండింగ్
BJP launches massive Modi Ka Parivar campaign to counter Lalu Prasad

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్ తదితర బీజేపీ నాయకులు తమ ట్విట్టర్ బయోలో తమ పేరు తర్వాత 'మోదీ కా పరివార్' అంటూ జత చేసుకున్నారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నిన్న పాట్నాలో జరిగిన సభలో ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ తమ పిల్లలను టార్గెట్ చేస్తున్నారని, ఆయనకు కుటుంబం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీ అగ్రనాయకులు మొదలు చాలామంది తమ ఎక్స్ బయోలో తమ పేరు పక్కన 'మోదీ కా పరివార్' అని జత చేసుకుంటున్నారు.

'"నేను మోదీ కుటుంబం" మా కుటుంబం వసుదైక కుటుంబం. మా లక్ష్యం విశ్వ యవనికపై మువ్వన్నెల జెండా సగర్వంగా రెపరెపలాడేలా చేయడం' అని బండి సంజయ్ తన బయోలో మార్పు చేసిన అనంతరం ట్వీట్ చేశారు.

లాలూ ప్రసాద్ వ్యాఖ్యలపై ఆదిలాబాద్ సభలో ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కిషన్ రెడ్డి పోస్ట్ చేశారు. 140 కోట్ల మంది భారతీయులు నా పరివారం... దేశంలోని నా అక్కాచెల్లెల్లు, అన్నదమ్ములు, తల్లులు, బిడ్డలు నా కుటుంబం... రైతులు, పేదలు, పిల్లలు... నా కుటుంబం అని ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు. నా భారత్... నా పరివారం అని పేర్కొన్నారు. ఈ వీడియోను కిషన్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, కిరెన్ రిజిజు, అనురాగ్ ఠాకూర్, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు తమ సోషల్ మీడియా ఖాతాలను 'మోదీ కా పరివార్' అని మార్చుకుంటున్నారు. 'నేను కూడా మోదీ కుటుంబ సభ్యుడినే' అంటూ సామాన్యులు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

More Telugu News