Spanish Woman: ఝార్ఖండ్‌లో సామూహిక లైంగికదాడికి గురైన స్పానిష్ మహిళ కన్నీటి వీడియో.. పోలీసుల అభ్యర్థనతో తొలగింపు

Spanish Tourist Who Gang Raped In Jharkhand Says Thought We Were Going To Die
  • తామిక బతుకుతామని అనుకోలేదన్న బాధిత మహిళ
  • ఏడుగురు వ్యక్తులు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారన్న మహిళ
  • దుండగుల దాడిలో మహిళ ముఖానికి తీవ్ర గాయాలు
  • దేవుడి దయవల్లే బతికి ఉన్నామన్న బాధితురాలు
  • దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు
  • నిందితుల కోసం కొనసాగుతున్న వేట
‘‘మాపై జరిగిన దారుణం ఇకముందు మరెవరిపైనా జరగొద్దు. ఏడుగురు వ్యక్తులు నాపై లైంగికదాడికి పాల్పడ్డారు’’ అంటూ ఝార్ఖండ్‌లో సామూహిక అత్యాచారానికి గురైన స్పానిష్ మహిళ (28) సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆ వీడియోలో ఆమె ముఖం ఉబ్బి పోయి కనిపించింది. ముఖం నిండా గాయాలు ఉన్నాయి. తామిక బతుకుతామని అనుకోలేదని, దేవుడి దయ వల్లే బతికామని వీడియోలో ఆమె పేర్కొన్నారు.

ఝార్ఖండ్‌లో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న ఈ జంట బైక్‌లపై ప్రపంచయాత్ర చేయాలని ఐదేళ్ల క్రితమే నిర్ణయించుకున్నారు. 63 దేశాలను చుట్టి రావాలని ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగా 1.7 లక్షల కిలోమీటర్లు జర్నీ చేయాలని భావించారు. స్పెయిన్ నుంచి పాకిస్థాన్, బంగ్లాదేశ్ మీదుగా భారత్ లోని బీహార్ కు చేరుకుని, అక్కడి నుంచి నేపాల్ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ, ఝార్ఖండ్‌లో వారు దుండగుల చేతికి చిక్కారు. రాత్రిపూట రోడ్డు పక్కనే టెంట్ లో నిద్రిస్తున్న జంటపై దాడిచేసిన దుండగులు.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

తమ బాధను వెళ్లగక్కుతూ వారు షేర్ చేసిన వీడియోను బాధిత మహిళ పార్ట్‌నర్ (64) ఆ తర్వాత తొలగించారు. దర్యాప్తునకు భంగం కలుగుతుందన్న పోలీసుల విజ్ఞప్తితో ఆయన దానిని డిలీట్ చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మిగతా వారి కోసం వేట కొనసాగుతోందని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది.
Spanish Woman
Jharkhand
Gang Rape
Crime News

More Telugu News