Sreeleela: గోదాదేవిగా శ్రీలీల అద్భుత నాట్య ప్రదర్శన... వీడియో ఇదిగో!

  • ముచ్చింతల్ లోని చిన్నజీయర్ ఆశ్రమంలో సమత కుంభ్-2024
  • గోదను నేను గోదను... రంగని తగు దానను అంటూ శ్రీలీల నృత్యరూపకం
  • వైరల్ అవుతున్న వీడియో
Sreeleela sizzling  classical dance performance video gone viral

హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో ఉన్న చిన్నజీయర్ ఆశ్రమంలో సమత కుంభ్-2024 కార్యక్రమం నిర్వహించారు. ఇందులో టాలీవుడ్ యువ నటి శ్రీలీల ప్రదర్శించిన నృత్యరూపకం హైలైట్ గా నిలిచింది. తిరుప్పావై పాశురాలను గానం చేస్తూ, ఆ శ్రీరంగనాథుడుని కొంగున ముడేసుకున్న గోదాదేవిగా శ్రీలీల నాట్య ప్రదర్శన అందరినీ అలరించింది. 

ఇప్పటి హీరోయిన్లలో శాస్త్రీయ నృత్యంలో ఈ స్థాయి పరిపూర్ణత సాధించినవారు అరుదు అనే చెప్పాలి. శ్రీలీల అంత అద్భుతంగా నాట్యం చేసిందంటే అతిశయోక్తి కాదు. "గోదను నేను గోదను... రంగని తగు దానను" అంటూ తన అందమైన కళ్లతో ఒలికించిన హావభావాలు, ప్రదర్శించిన హస్త ముద్రలు, లయబద్ధమైన పాదాల కదలికలు... చూడ్డానికి రెండు కన్నులు చాలవనిపించేలా శ్రీలీల నాట్యకౌశలాన్ని ఆవిష్కృతం చేసింది. 

దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సినిమాల్లో శ్రీలీలను మోడ్రన్ అమ్మాయిగా చూసిన వారికి ఈ 'శాస్త్రీయ' కోణం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 

తన డాన్స్ పెర్ఫార్మెన్స్ పై శ్రీలీల స్పందించింది. తాను చిన్నప్పుడే శాస్త్రీయనృత్యంలో శిక్షణ పొందానని వెల్లడించింది. గోదాదేవి ఒక మహిళా రత్నం అని, అలాంటి స్త్రీమూర్తి గాథ ఎంతో రమ్యంగా ఉంటుందని వివరించింది.

ఈ ప్రదర్శన ఇవ్వడానికి మంజుభార్గవి ఎంతో ప్రోత్సహించారని, ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొంది. దాదాపు పదిహేనేళ్ల తర్వాత మళ్లీ స్టేజ్ పై నాట్యం చేశానని, ఈ ప్రదర్శన తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని చెప్పింది.

More Telugu News