Nara Lokesh: మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్ తో తొక్కించి చంపేస్తారా?: నారా లోకేశ్

Nara Lokesh fires on YSRCP
  • మాచర్ల ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోందన్న లోకేశ్
  • టీడీపీ వాళ్లు నీళ్లు పట్టుకోవడానికి వీల్లేదని మహిళను వైసీపీ సైకో బెదిరించాడని మండిపాటు
  • ట్రాక్టర్ తో మూడు సార్లు తొక్కించాడని ఆగ్రహం
దేశంలో ఎక్కడా లేని విధంగా పల్నాడులోని మాచర్ల ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని టీడీపీ యువనేత నారా లోకేశ్ అన్నారు. మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం మల్లవరం తండాలో తాగునీటిని పట్టుకునేందుకు ట్యాంకర్ వద్దకు వచ్చిన గిరిజన మహిళ సామినిబాయి (50)ని వైసీపీకి చెందిన ఒక సైకో ట్రాక్టర్ తో తొక్కించి అత్యంత కిరాతకంగా చంపేసిన ఘటన తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. 

వారం రోజులుగా గుక్కెడు నీరు దొరకని పరిస్థితుల్లో రాకరాక వచ్చిన ట్యాంకర్ వద్ద నీళ్లు పట్టుకోవడానికి వెళ్లిన గిరిజన మహిళలను... మీరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు, నీళ్లు పట్టుకోవడానికి వీల్లేదని వైసీపీ సైకో బెదిరించాడని మండిపడ్డారు. తాగునీటికి, పార్టీలకు సంబంధమేంటని ప్రశ్నించడమే సామినీబాయి చేసిన నేరమని అన్నారు.

మాచర్లలో జరుగుతున్న వరుస ఘటనలు చూశాక మనం ఉన్నది ప్రజాస్వామ్యంలోనా లేక రాతి యుగంలోనా అన్న అనుమానం కలుగుతోందని చెప్పారు. వైసీపీకి చెందిన సైకో ఊరంతా చూస్తుండగా స్వైర విహారం చేస్తూ 3 సార్లు ట్రాక్టర్ తో తొక్కించి సామినిబాయిని చంపేస్తే... డ్రైవింగ్ రాకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని కేసు కట్టడం పతనమైన పోలీసు వ్యవస్థకు పరాకాష్ఠ కాదా? అని ప్రశ్నించారు. మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్ తో తొక్కించి చంపేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Nara Lokesh
Telugudesam
YSRCP
AP Politics

More Telugu News