Revanth Reddy: అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి హామీ

Revanth Reddy promises allotment of land to eligible JNJ society members
  • శుక్రవారం సీఎం‌ను కలిసిన జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ సభ్యులు
  • స్థలాల కేటాయింపుపై రోడ్‌ మ్యాప్‌తో వస్తే వెంటనే సంతకం చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి
  • ఈ ప్రక్రియను 100 రోజుల్లోనే ప్రారంభించినందుకు సీఎంకు సొసైటీ సభ్యుల ధన్యవాదాలు
రాష్ట్రంలో అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ఇళ్ల స్థలాల అప్పగింతపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మీడియా అకడామీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డితో జేఎన్‌జే ప్రతినిధులు చర్చించి ఓ రోడ్ మ్యాప్‌తో వస్తే ఫైలుపై నిమిషంలో సంతకం చేస్తానని వ్యాఖ్యానించారు. శుక్రవారం జేఎన్‌జే సభ్యులైన పత్రికలు, టీవీ విలేకరులు సీఎంను కలిసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

జర్నలిస్టులకు తమ ప్రభుత్వం అమిత ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో మరే సంస్థకూ నామినేటెడ్ ఛైర్మన్ ను నియమించకపోయినా మీడియా అకాడమీకి చైర్మన్ ఎంపిక చేయడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఇక ఇళ్ల స్థలాల అప్పగింతను 100 రోజుల్లో మొదలు పెడతామన్న హామీని అమలు చేస్తున్నందుకు మీడియా ప్రతినిధులు సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. సొసైటీకి 16 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ ప్రభుత్వం నిజాంపేట, పేట్‌బషీరాబాద్ ప్రాంతాల్లో 70 ఎకరాల స్థలాన్ని జేఎన్‌జేకు కేటాయించిందని తెలిపారు. సొసైటీ స్థలాన్ని అప్పగించాలని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చినా అవి అమలు కాలేదన్నారు. నాటి నుంచి స్థలాన్ని కాపాడుకుంటూ వస్తున్నామన్నారు. 

అయితే, రాష్ట్రంలో ఇతర అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో మీడియా అకాడమీతో చర్చించి కార్యాచరణ రూపొందిస్తే వారికి కూడా స్థలాలను ఇస్తామనీ సీఎం ఈ సందర్భంగా తెలిపారు. జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కార్డులతోపాటు ఇతర సమస్యలపైనా దృష్టి సారించామన్నారు. ఇక, సీఎం ఆదేశాల మేరకు ఇళ్ల స్థలాలపై వెంటనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Revanth Reddy
JNJ Housing Society
Congress

More Telugu News