Krish: హైదరాబాద్ డ్రగ్స్ పార్టీ కేసు.. డైరెక్టర్ క్రిష్ రక్త, మూత్ర నమూనాల సేకరణ

  • రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం
  • శుక్రవారం పోలీసుల ఎదుట విచారణకు సినీదర్శకుడు క్రిష్ హాజరు
  • విచారణ అనంతరం నమూనాల సేకరణ
  • ఇతర నిందితుల కోసం వివిధ రాష్ట్రాల్లో పోలీసుల గాలింపు
blood urine sample collected from Director Krish In relation to Radison Hotel Drugs case

హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్స్‌ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. శుక్రవారం సినీదర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ రక్త, మూత్ర నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. గత నెల 24వ తేదీన డ్రగ్స్ పార్టీ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉదంతంపై స్పందించిన క్రిష్ తాను పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమేనని చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు శుక్రవారం ఆయనను విచారణకు హాజరు కావాలని పిలిచినట్టు వార్తా కథనాలు వెలువడ్డాయి. కానీ, క్రిష్ వచ్చే సోమవారం విచారణకు హాజరు కానున్నట్టు ప్రచారం జరిగింది. అయితే, శుక్రవారమే ఆయన విచారణకు హాజరయ్యారు. క్రిష్‌ను కొద్ది సేపు విచారించిన పోలీసులు ఆ తరువాత ఆయన నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. 

మరోవైపు, కేసులో ప్రధాన నిందితుడు గజ్జల వివేకానంద్, నిర్భయ్, కేదార్‌నాథ్ నమూనాలు ఇప్పటికే పాజిటివ్‌గా వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, గతంలో హోటల్ రెయిడ్ సందర్భంగా డ్రగ్స్ దొరక్కపోవడంతో ప్రధాన నిందితుడికి జ్యుడీషియల్ రిమాండ్‌కు అనుమతి లభించలేదు. కానీ, హోటల్‌లో లభించిన వైట్ పేపర్‌పై కొకైన్ ఆనవాళ్లు లభించడంతో డ్రగ్స్ పెడ్లర్ అబ్బాస్‌, మరో నిందితుడికి కోర్టు జ్యుడీషియల్ రిమాండ్‌ విధించింది. 

కాగా, కేసుతో ప్రమేయమున్న 14 మంది కోసం పోలీసులు విస్తృత గాలింపు చేపడుతున్నారు. కేసులో నిందితులుగా ఉన్న లిషి, సందీప్, శ్వేత, నీల్ ఇప్పటికీ పోలీసుల ముందుకు రాలేదు. వారు పొరుగు రాష్ట్రాల్లో ఉన్నట్టు తేలడంతో పోలీసులు గోవా, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. నమూనా సేకరణలో ఆలస్యం జరిగే కొద్దీ పరీక్షల్లో డ్రగ్స్ ఆనవాళ్లు తొలగిపోతాయనే కారణంతోనే వారు కాలయాపన చేస్తున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక నీల్ విదేశాలకు వెళ్లినట్టు అనుమానాలున్న నేపథ్యంలో పోలీసులు అతడిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఇక పార్టీలో డ్రగ్స్ సరఫరా చేసిన మీర్జా వహీద్ బేగ్ ‌ను విచారించిన పోలీసులు మరో ఇద్దరు పెడ్లర్ల ఆచూకీ కనుగొన్నారు. యాకుత్‌పురాకు చెందిన బేగ్‌కు ఇమ్రాన్, అబ్దుల్ రెహ్మాన్‌లు కొకైన్ సరఫరా చేసినట్టు గుర్తించారు. వీరిద్దరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

More Telugu News