Chegondi Suryaprakash: ప్రశ్నించినవాళ్లను కోవర్టులు అంటున్నాడు... పవన్ పై చేగొండి సూర్యప్రకాశ్ ఫైర్

  • జనసేన నుంచి బయటికి వచ్చేసిన చేగొండి సూర్యప్రకాశ్
  • నేడు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిక
  • పార్టీని నడపలేని అసమర్థుడు పవన్ అంటూ విమర్శలు
  • ఇప్పటిదాకా 100 నియోజకవర్గాలకు ఇన్చార్జిలను కూడా నియమించలేదని వెల్లడి
Chegondi Suryaprakash fires on Pawan Kalyan

సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన చేగొండి సూర్యప్రకాశ్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగారు. టీడీపీకి కొమ్ము కాస్తున్న పవన్ కల్యాణ్... జనసేన పార్టీని నమ్ముకున్న బడుగు బలహీన వర్గాలను ముంచేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 

ఒక రాజకీయ పార్టీ నడపడం చేతకాని అసమర్థుడు పవన్ కల్యాణ్ అని ధ్వజమెత్తారు. 100 నియోజకవర్గాల్లో ఇప్పటిదాకా ఇన్చార్జిలను కూడా నియమించలేదని అన్నారు. పార్టీని బలోపేతం చేయడం అటుంచి, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలన్న ఆరాటమే ఎక్కువని విమర్శించారు.

చంద్రబాబును, లోకేశ్ ను అందలం ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్న పవన్... జనసేన పార్టీని నాదెండ్ల మనోహర్ చేతిలో పెట్టారని విమర్శించారు. ఎవరైనా తనను ప్రశ్నిస్తే పవన్ భరించలేకపోతున్నాడని, వారిని వైసీపీ కోవర్టులంటున్నాడని సూర్యప్రకాశ్ ఆగ్రహం వెలిబుచ్చారు. సలహాలు ఇచ్చేవాళ్లు, ప్రశ్నించే వాళ్లు ఉండకూడదనుకుంటే పార్టీని మూసుకుని ఇంట్లో కూర్చోవాలని హితవు పలికారు.

జనసేన సమావేశాల్లో వేదికపై ముగ్గురే ఉంటారని, ఇంకెవరికీ స్థానం ఉండదని... ఈ ఆరేళ్ల కాలంలో పవన్ తనతో ఓ 30 నిమిషాలు మాట్లాడి ఉంటాడేమో అని వివరించారు. జనసేన పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండదని, మాట్లాడే స్వేచ్ఛ లేదని అన్నారు. 

వ్యక్తిత్వాన్ని చంపుకుని జనసేనలో ఉండలేక బయటికి వచ్చేశానని స్పష్టం చేశారు. తాను ఇంత వరకు అర్హతలేని పార్టీలో ఉండి టైమ్ వేస్ట్ చేసుకున్నానని అన్నారు.  తాను ఎలాంటి షరతులు విధించకుండా వైసీపీలోకి వచ్చానని సూర్యప్రకాశ్ పేర్కొన్నారు.

More Telugu News