Kollu Ravindra: జగన్ నిర్వాకంతో 2 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు: కొల్లు రవీంద్ర

Kollu Ravindra questions CM Jagan
  • విద్యాదీవెన నిధులు విడుదల చేసిన సీఎం జగన్
  • జగన్ విద్యారంగాన్ని కూడా దోచేస్తున్నాడన్న కొల్లు రవీంద్ర
  • విద్యార్థులకు దక్కాల్సిన రూ.5 వేల కోట్లను సీఎం దోచేశాడని ఆరోపణ 
సీఎం జగన్ నేడు విద్యా దీవెన మూడో త్రైమాసికం నిధులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో, టీడీపీ నేత కొల్లు రవీంద్ర విమర్శనాస్త్రాలు సంధించారు. విద్యార్థులకు మేలు చేసే నెపంతో జగన్ రెడ్డి విద్యారంగాన్ని కూడా తన దోపిడీకి కేంద్ర బిందువుగా మార్చుకున్నాడని వ్యాఖ్యానించారు. 

చంద్రబాబు హయాంలో 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ సాయం అందిస్తే, జగన్ రెడ్డి ఆ సంఖ్యను 9 లక్షలకే పరిమితం చేసి, 7 లక్షల మంది దళిత, బీసీ, మైనారిటీ విద్యార్థుల్ని ఉన్నత విద్యకు దూరం చేశాడని ఆరోపించారు. 

ట్యాబ్ ల పేరుతో రూ.1,200 కోట్లు, విద్యా కానుక పేరుతో రూ.400 కోట్లు, నాడు-నేడు పథకం ముసుగులో రూ.3,000 కోట్లు... వెరసి విద్యార్థులకు దక్కాల్సిన దాదాపు రూ.5,000 కోట్లను ముఖ్యమంత్రే దోచేశాడని కొల్లు రవీంద్ర వివరించారు. 

"57 నెలల పాలనలో రూ.3,400 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఎగనామం పెట్టాడు. దానిలో విద్యా దీవెన సొమ్ము రూ.2,700 కోట్లు అయితే, ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ము రూ.450 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం విద్యాదీవెన పథకానికి చెల్లించాల్సిన సొమ్ములో జగన్ రెడ్డి రూ.120 కోట్లు కోత పెట్టాడు. 

జగన్ నిర్వాకంతో రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు తమ సర్టిఫికెట్లు ఆపేసిన విద్యాసంస్థల చుట్టూ తిరుగుతున్నారు. ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు 2020-21 విద్యాసంవత్సరానికి గాను,  ఫీజు రీయింబర్స్ మెంట్ నిలిపిస్తూ జగన్ సర్కార్  జీవో నెం. 77 ఇవ్వడం వాస్తవం కాదా? జగన్ నిర్వాకంతో 1.07 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల విద్యార్థులు ఉన్నతవిద్యకు దూరమైంది నిజం కాదా?" అని కొల్లు రవీంద్ర నిలదీశారు.
Kollu Ravindra
Jagan
Students
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News