YS Sunitha: సీబీఐ దర్యాప్తు నెమ్మదిగా సాగడం వెనుక బీజేపీ హస్తం ఉందా?.. అనే ప్రశ్నకు వైఎస్ సునీత సమాధానం ఇదిగో!

  • బీజేపీ హస్తం ఉందా? లేదా? అనే విషయం తనకు తెలియదన్న సునీత
  • నాన్నను చంపిన వారిని రక్షించే పనిలో జగన్ ఉన్నారని విమర్శ
  • శివశంకర్ రెడ్డి అరెస్ట్ తర్వాత కథ మొత్తం మారిపోయిందని వెల్లడి
YS Sharmila comments on CBI inquiry in YS Viveka murder case

తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆయన కూతురు వైఎస్ సునీత అసహనం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు బీజేపీ పెద్దల అండ ఉండటం వల్లే జాప్యం జరుగుతోందనే విమర్శలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ అంశంపై సునీతను ప్రశ్నిస్తే ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చారు. సీబీఐ విచారణ నెమ్మదిగా సాగడం వెనుక బీజేపీ హస్తం ఉందా? లేదా? అనే విషయం తనకు తెలియదని సునీత చెప్పారు.

నాన్నను గొడ్డలితో చంపారనే విషయం జగన్ కు ఎలా తెలిసిందో బయటకు రావాల్సి ఉందని సునీత అన్నారు. మంచికి, చెడుకు మధ్య పోరాటమని... పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధమని జగన్ అంటుంటారని... మరి తన తండ్రిని చంపిన పెత్తందారుల సంగతి ఏమిటని ప్రశ్నించారు. మాట్లాడితే అక్కాచెల్లెమ్మలు అంటుంటారని... మరి ఈ చెల్లెమ్మ సంగతి ఏమిటని అడిగారు. తన తండ్రిని చంపిన వారిని రక్షించే పనిలో జగన్ ఉన్నారని చెప్పారు.

అప్రూవర్ గా మారిన దస్తగిరిని కూడా జైలుకు వెళ్లి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. సీబీఐ ఎస్పీ రాంసింగ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెపితే రూ. 20 కోట్లు అడ్వాన్స్ గా ఇస్తామని చెప్పారని దుయ్యబట్టారు. ఎంత ధైర్యం ఉంటే జైలుకు వెళ్లి ప్రలోభాలకు గురి చేస్తారని మండిపడ్డారు. దస్తగిరి ఎంతో ధైర్యంగా వ్యవహరిస్తున్నాడని కితాబునిచ్చారు. తనపైనే కేసులు పెట్టారని... రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఇది ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. తొలి నుంచి కూడా తనకు తన సోదరి షర్మిల అండగా ఉన్నారని అన్నారు. బీజేపీ నుంచి ఆదినారాయణరెడ్డి మద్దతుగా ఉన్నారని చెప్పారు. 

నాన్న హత్యకేసులో శివశంకర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసిన తర్వాత కథ మొత్తం మారిపోయిందని సునీత అన్నారు. శివశంకర్ రెడ్డి అరెస్టుతో అందరిలో భయం మొదలయిందని... దీంతో, సీబీఐ అధికారులపైనే కేసులు పెట్టడం ప్రారంభించారని చెప్పారు. ఈ క్రమంలో కడప నుంచి సీబీఐ అధికారులు హైదరాబాద్ కు వెళ్లిపోయారని తెలిపారు. ఈ కేసులో ఉన్న నిందితులు బెయిల్ పై బయటకు వస్తే విచారణను ప్రభావితం చేస్తారని చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News