Paytm: సమీపిస్తున్న ఆర్బీఐ డెడ్‌లైన్.. పేటీఎం మాతృ సంస్థ కీలక నిర్ణయం

  • పేటీఎం పేమెంట్స్ బ్యాంకు కార్యకలాపాల నిలివేతకు మార్చి 15 డెడ్‌లైన్
  • ఈ బ్యాంక్‌తో ఒప్పందాలు రద్దు చేసుకోనున్న మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్
  • ఆర్బీఐ నిబంధనల మేరకు ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నట్టు తాజాగా ప్రకటన
Paytm to discontinue inter company agreements with payments bank

ఆర్బీఐ ఆంక్షల డెడ్‌లైన్ సమీపిస్తున్న తరుణంలో పేటీఎం మాతృసంస్థ వన్97కమ్యూనికేషన్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌తో అంతర్గతంగా కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకునేందుకు నిర్ణయించినట్టు శుక్రవారం వెల్లడించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యక్రమాలన్నిటినీ మార్చి 15 లోపు ముగించాలన్న ఆర్బీఐ డెడ్‌లైన్ మేరకు సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. 

పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షల కారణంగా పేటీఎం ఒక్కసారిగా ఇబ్బందుల్లో పడ్డ విషయం తెలిసిందే. పర్యవేక్షణ లోపాలు, నిబంధనల అతిక్రమణ తదితర కారణాలతో ఆర్బీఐ..పేటీఎం పేమెంట్స్ బ్యాంకు కార్యకలాపాలు శాశ్వతంగా ముగించేయాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి తొలుత ఫిబ్రవరి 29ని డెడ్‌లైన్‌గా విధించిన ఆర్బీఐ ఆ తరువాత కస్టమర్ల సౌకర్యార్థం తుది తేదీని మార్చి 15 వరకూ పొడిగించింది. 

ఈ సంక్షోభం నేపథ్యంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చైర్మన్ విజయ్‌ శేఖర్ శర్మ తన పదవి నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలో సంస్థ బోర్డును పునర్వ్యవస్థీకరించారు. బోర్డు డైరెక్టర్లుగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ శ్రీనివాసన్ శ్రీధర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవేంద్రనాథ్ సారంగి, బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ కుమార్ గార్గ్, మాజీ ఐఏఎస్ అధికారి రజనీ శేఖ్రీ సిబల్ నియమితులయ్యారు. ఇక పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో విజయ్‌శేఖర్ శర్మకు 51 శాతం వాటా ఉండగగా, మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌కు 41 శాతం వాటా ఉంది.

More Telugu News