Dhaka Fire Accident: బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 44 మంది మృతి

44 killed as fire engulfs multi storey building in Bangladeshs Dhaka

  • ఢాకాలోని ఆరు అంతస్తుల భవనంలో గురువారం రాత్రి ప్రమాదం
  • మొదటి అంతస్తులోని రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం
  • పైఅంతస్తులకు వ్యాపించిన మంటలు  
  • పలువురికి తీవ్ర గాయాలు

బంగ్లాదేశ్‌లో గురువారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఢాకాలోని ఓ ఆరు అంతస్తుల భవనంలో సుమారు రాత్రి 9.30 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 44 మంది దుర్మరణం చెందారు. అనేక మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి శుక్రవారం వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. 

భవనం మొదటి అంతస్తులోని ఓ రెస్టారెంట్‌లో తొలుత మంటలు చెలరేగాయి. చూస్తుండగానే అవి పైఅంతస్తులకు వ్యాపించాయి. ఇతర అంతస్తుల్లోనూ రెస్టారెంట్లు, ఓ దుస్తుల దుకాణం ఉన్నట్టు స్థానిక మీడియా చెబుతోంది. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శాఖ 13 ఫైర్ సర్వీస్ యూనిట్లను రంగంలోకి దించింది. భవనంలో చిక్కుకున్న 75 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మంటల నుంచి తప్పించుకునేందుకు అనేక మంది భవనం పై అంతస్తులోని ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా పారిపోయే ప్రయత్నం చేశారు.

ఆసుపత్రులకు తరలించిన వారిలో 33 మంది ఢాకా మెడికల్ కాలేజ్‌లో కన్నుమూయగా మరో 10 మంది షేక్ హసీనా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ రెండు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న మరో 22 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అనేక మందిలో ఊపిరితిత్తులు పాడయ్యాయని వైద్యులు పేర్కొన్నారు. కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేనంతా కాలిపోయాయని పోలీసులు తెలిపారు. భవనంలో ఎక్కడ చూసినా గ్యాస్ సిలిండర్లతో ప్రమాదకరంగా మారిందని స్థానిక మీడియా చెబుతోంది.

  • Loading...

More Telugu News