BJP: అభ్యర్థుల ఎంపికకు బీజేపీ అనుసరించిన విధానాలు ఇవే.. 70-80 మంది ఎంపీలకు సీటు కష్టమే!

  • ‘నమో యాప్’ ద్వారా అట్టడుగు స్థాయిలో జనాభిప్రాయాలు తెలుసుకున్న బీజేపీ అధిష్ఠానం
  • ప్రస్తుత ఎంపీ పనితీరుతో పాటు నియోజకవర్గ పరిధిలో ముగ్గురు పాప్యులర్ వ్యక్తులపై జనాభిప్రాయం సేకరణ
  • అభ్యర్థులపై నిర్ణయానికి ముందు సర్వే సంస్థలనూ ఆశ్రయించిన కాషాయ పార్టీ
  • నియోజకవర్గ పరిధిలో పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించిన మంత్రులు
  • ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అభ్యర్థులను ఖరారు చేయాలని భావిస్తున్న పార్టీ 
Public Feedback and Tech Used by BJP to Picking Candidates For upcoming Lok Sabha Polls

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనకు కేంద్రంలోని అధికార బీజేపీ సంసిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం రాత్రి పార్టీ కీలక సమావేశం జరిగింది. నేడు (శుక్రవారం) తొలి జాబితాను ప్రకటించే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అభ్యర్థుల ఎంపిక కోసం ప్రజాభిప్రాయం, పార్టీలో అంతర్గత లెక్కలు-సమీకరణాలు, అత్యున్నత స్థాయి వ్యూహాత్మక చర్చలు విధానాల ద్వారా అభ్యర్థులపై నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు గురువారం రాత్రి జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు సీనియర్ నేతలు కూలంకుషంగా చర్చించారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించక ముందే 543 లోక్‌సభ సీట్లలో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేయాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించినట్టుగా సమాచారం. కాగా ఏప్రిల్-మే నెలల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది.

సాంకేతికతతో జనాభిప్రాయ సేకరణ
క్షేత్రస్థాయిలో అట్టడుగు జనాభిప్రాయ సేకరణ కోసం బీజేపీ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించినట్టుగా జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ‘నమో యాప్‌’ను ఉపయోగించి ప్రస్తుత ఎంపీల పనితీరుపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంది. అంతేకాదు ఆ ప్రాంతంలో పార్టీకి చెందిన ముగ్గురు ప్రజాదరణ కలిగిన వ్యక్తులపై అభిప్రాయాలను సేకరించింది. స్థానిక ప్రజల మనోభావాలు, ఆకాంక్షలకు అనుగుణంగా యాప్‌ ద్వారా వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ను పార్టీ హైకమాండ్ విస్తృతంగా పరిగణనలోకి తీసుకుంది. గత రెండేళ్లలో ఎంపీల పనితీరును సర్వే ద్వారా పార్టీ అంచనా వేసింది. ఇక అభ్యర్థుల విషయంలో మరింత క్లారిటీ కోసం సర్వే ఏజెన్సీలను కూడా బీజేపీ అధిష్ఠానం సంప్రదించిందని జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.  

లోక్‌సభ స్థానాల పరిధిలో పర్యటించిన మంత్రులు
ఇక లోక్‌సభ స్థానాల పరిధిలో పర్యటించి నివేదికలు రూపొందించే బాధ్యతలను పలువురు మంత్రులకు అప్పగించారు. మంత్రులు, పార్టీ సంస్థాగత విభాగాల ద్వారా సేకరించిన సమాచారాన్ని రాష్ట్ర స్థాయి ఎన్నికల కమిటీ సమావేశాలలో చర్చించారు. ఈ కమిటీల సమాచారం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు పునాదిగా ఉంది. రాష్ట్ర స్థాయి ఎన్నికల కమిటీ సమావేశాల అనంతరం ప్రతి రాష్ట్రంలోని బీజేపీ ప్రధాన నేతల బృందంతో పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ వంటి అగ్ర నేతలతో చర్చలు జరిపారు. 

ఇక బలమైన అభ్యర్థుల కోసం ఇతర పార్టీలకు చెందినవారిని కూడా బీజేపీ ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఇదే సమయంలో పనితీరు సరిగా లేని అభ్యర్థులను ఏమాత్రం మొహమాటం లేకుండా మార్చేయాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. ప్రస్తుత ఎంపీల్లో దాదాపు 60-70 మంది ఎంపీలకు టికెట్లు దక్కకపోవచ్చని సమాచారం. ఆయా స్థానాల్లో కొత్తవారికి పోటీ చేసే అవకాశం కల్పించనున్నారని తెలుస్తోంది. అయితే ఓబీసీ వర్గాలకు చెందిన ఎంపీల్లో చాలామంది తిరిగి పోటీ చేయబోతున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున 85 మంది ఓబీసీ అభ్యర్థులు ఎంపీలుగా విజయం సాధించిన విషయం తెలిసిందే.

More Telugu News