Vedic Clock: ‘వేద గడియారం’ అంటే ఏమిటి?.. ప్రపంచంలో తొలి క్లాక్‌ని నేడు ప్రారంభించనున్న ప్రధాని మోదీ

  • మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో వేద గడియారం ఏర్పాటు
  • వేద హిందూ పంచాంగం సమాచారం ప్రకారం టైమ్ నుంచి గ్రహస్థితిగతుల వరకు పూర్తి సమాచారం ప్రదర్శన
  • భారతీయ కాల గణన సంప్రదాయాన్ని పునరుద్ధరించే ప్రయత్నమన్న నిర్వాహకులు
Worlds first Vedic Clock to be inaugurated by PM Modi friday

ప్రపంచంలోనే మొట్టమొదటి 'వేద గడియారాన్ని (Vedic Clock)' ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (శుక్రవారం) ప్రారంభించనున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ‘విక్రమాదిత్య వేద గడియారం’ పేరుతో సిద్ధమైన ఈ క్లాక్‌ను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభిస్తారు. పురాతన భారతీయ సంప్రదాయ పంచాంగం (కాల గణన పధ్ధతి) ప్రకారం ఈ గడియారం పనిచేస్తుంది. ఉజ్జయినిలోని జంతర్ మంతర్ ఏరియాలో 85 అడుగుల ఎత్తున్న టవర్‌పై ఈ క్లాక్‌ని అమర్చారు.

ఈ గడియారం ప్రత్యేకలు ఇవే..
వేద హిందూ పంచాంగం సమాచారాన్ని ఈ ‘వేద గడియారం’ ప్రదర్శిస్తుంది. గ్రహాల స్థితిగతులు, ముహూర్తం, జ్యోతిష గణనలు, అంచనాలకు సంబంధించిన సమాచారాన్ని డిస్‌ప్లే చేస్తుంది. అంతేకాదు భారత ప్రామాణిక కాలం (IST), జీఎంటీ (GMT)లను ఈ గడియారం సూచిస్తుంది.

  • గడియారం సంవత్సరం, మాసం, చంద్రుడి స్థానం, శుభ గడియలు, నక్షత్రం, సూర్యగ్రహణం, చంద్ర గ్రహణం వంటి ఇతర వివరాలను కూడా అందిస్తుంది.
  • ఒక సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం ఆధారంగా  ఈ గడియారం సమయాన్ని లెక్కిస్తుంది.

కాగా భారత కాల గణన విధానం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనదని ఓ ప్రకటనలో నిర్వాహకులు పేర్కొన్నారు. భారత కాల గణన విధానం సూక్ష్మమైనదని, స్వచ్ఛమైనదని, దోషరహితమైనదని తెలిపారు. ప్రామాణికమైన, విశ్వసనీయత కలిగిన ఈ వ్యవస్థను ఉజ్జయినిలో వేద గడియారం రూపంలో తిరిగి ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉజ్జయిని నుంచి సూచించిన సమయాన్నే ప్రపంచమంతా వినియోగిస్తోందని అన్నారు. భారతీయ కాల గణన సంప్రదాయాన్ని ఈ వేద గడియారం ద్వారా పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నామని నిర్వాహకులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

More Telugu News