Prathipati Sarath: ప్రత్తిపాటి శరత్ ను తీసుకెళ్లింది పోలీసులా? తాడేపల్లి ముఠానా?: నారా లోకేశ్

  • ప్రత్తిపాటి పుల్లారావు తనయుడిపై పన్ను ఎగవేత ఆరోపణలు
  • విజయవాడలో నేడు ప్రత్తిపాటి శరత్ అరెస్ట్
  • ప్రత్తిపాటి కుటుంబానికి అండగా ఉంటామన్న నారా లోకేశ్
Nara Lokesh reacts to Prathipati Sarath arrest

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు ప్రత్తిపాటి శరత్‍ను తీసుకెళ్లింది పోలీసులా? సైకో జ‌గ‌న్ తాడేప‌ల్లి ముఠానా? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిలదీశారు. టెర్ర‌రిస్టుని అరెస్టు చేసిన‌ట్టు ఎందుకు ర‌హ‌స్యంగా ఉంచుతున్నారు? అని ప్రశ్నించారు. శ‌ర‌త్‌కి ఏమైనా హాని త‌ల‌పెట్టారా అనే అనుమానాలు క‌లుగుతున్నాయని పేర్కొన్నారు. 

"ఈ అక్ర‌మ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్ర‌త్తిపాటి పుల్లారావు గారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండ‌గా ఉంటుంది. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ప్ప‌ద‌ని తెలిసి ఇలాంటి చర్యలకు దిగుతున్నారు. బ‌ల‌మైన టీడీపీ నేత‌లే ల‌క్ష్యంగా సైకో జ‌గ‌న్ ప‌న్నుతున్న కుతంత్రాల‌ను తిప్పికొడ‌తాం. శ‌ర‌త్‌ని త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాలి. త‌ప్పుడు కేసులు, అక్ర‌మ అరెస్టుల‌పై న్యాయ‌పోరాటం చేస్తాం. జ‌గ‌న్ దిగిపోయే ముందైనా ఇటువంటి సైకో చేష్ట‌లు ఆప‌క‌పోతే, భారీ మూల్యం చెల్లించాల్సి వ‌స్తుంది" అని నారా లోకేశ్ స్పష్టం చేశారు.

ఓటమి భయంతో జగన్ పిరికిపంద చర్యలకు దిగుతున్నాడు: అచ్చెన్నాయుడు

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును రాజకీయంగా ఎదుర్కోలేని జగన్ రెడ్డి పిరికి పంద చర్యలకు దిగుతున్నాడని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్ అరెస్ట్ అప్రజాస్వామికం అని పేర్కొన్నారు. 

"రాష్ట్రంలో జగన్ రెడ్డికి అన్ని వైపుల నుంచి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఐదేళ్ల నుంచి జగన్ రెడ్డి చేస్తున్న అరాచకాలకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో జగన్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడు. వ్యాపారంతో ఎటువంటి సంబంధం లేని, ఏ కంపెనీలోనూ షేర్ హోల్డర్‌గా లేని ప్రత్తిపాటి శరత్‌ను అకారణంగా అరెస్ట్ చేశారు. 

ఓటమి భయంతో ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడిని అక్రమంగా అదుపులోకి తీసుకొని.. ఆచూకీ కూడా చెప్పకుండా వేధించడం జగన్ సైకో చర్యలకు నిదర్శనం! అక్రమ కేసులు పెట్టి వేధించిన ఏ ఒక్కరిని వదలం. అందరి లెక్కలు తేలుస్తాం.

అక్రమ కేసులతో ప్రతిపక్ష పార్టీ నేతలను వేధిస్తున్న జగన్ సర్కార్‌కు మరో 45 రోజుల్లో రాజకీయ సమాధి కట్టడం ఖాయం. 45 రోజులు ఆగలేక జగన్ రెడ్డి తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంటున్నాడు" అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

More Telugu News