Telangana: తెలంగాణలో మెట్రో రైల్ కోచ్ ఫ్యాక్టరీ పెట్టండి: శంతను రాయ్‌ని కోరిన ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క

BEML CMD meets Deputy CM Mallu Bhatti Vikramarka
  • ప్రభుత్వం నుంచి అందుకు అవసరమైన భూమి, ఇతర వనరులు, సహకారం అందిస్తామని హామీ
  • BEML కంపెనీ పెట్టుబడులను అడిగి తెలుసుకున్న మల్లు భట్టి
  • తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపిన సీఎండీ శంతను రాయ్
తెలంగాణ రాష్ట్రంలో మెట్రో రైల్ కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని, ప్రభుత్వం నుంచి అందుకు అవసరమైన భూమి, ఇతర వనరులు, సహకారం అందిస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క... భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) కంపెనీ సీఎండీ శంతను రాయ్‌ని చెప్పారు. గురువారం సచివాలయంలో శంతను రాయ్ బృందంతో ఉపముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ కంపెనీ బేస్ ఎక్కడ? ఏ ఏ రంగాల్లో పెట్టుబడులు, ఉత్పత్తులు సృష్టిస్తుందో అడిగి తెలుసుకున్నారు. మెట్రో రైల్ కోచ్‌లు, రక్షణ, మైన్స్ వంటి రంగాల్లో తమ కంపెనీ పని చేస్తుందని శంతను రాయ్ వివరించారు.

తమ కంపెనీ బెంగళూరు కేంద్రంగా పని చేస్తోందని, రక్షణ రంగానికి సంబంధించి కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్‌లో, సింగరేణిలో ఎర్త్ మూవర్స్ రంగాల్లో పని చేస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లో ప్రాంతీయ కార్యాలయం ఉందని తెలిపారు. హైదరాబాద్‌లో మెట్రో విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున తాము ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఉన్నట్టు శంతనురాయ్ తెలిపారు.

మెట్రో కోచ్ ఫ్యాక్టరీల తయారీలో ఇతర కంపెనీలకు, BEMLకు  ఉన్న తేడా ఏమిటి? ధరలు, నాణ్యత వంటి అంశాల్లో మీకు ఉన్న ప్రత్యేకత ఏమిటో కంపెనీ లెటర్‌పై వివరించాలని మల్లు భట్టి కోరారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని వాతావరణం, వనరులను పరిశీలించాలని, త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక సమావేశం నిర్వహించి మెట్రో రంగానికి సంబంధించిన మీ కంపెనీ ఆసక్తులను సమగ్రంగా చర్చిద్దామని ఆయనకు తెలిపారు. ఈ సందర్భంగా beml కంపెనీ మెట్రో కోచ్ నమూనాను కంపెనీ సీఎండి శంతను రాయ్ బృందం డిప్యూటీ సీఎంకు అందించింది.
Telangana
Mallu Bhatti Vikramarka
railways

More Telugu News