MP Ramulu: బీఆర్ఎస్ కు షాక్.. బీజేపీలో చేరిన ఎంపీ రాములు

  • తరుణ్ ఛుగ్ సమక్షంలో బీజేపీలో చేరిన రాములు
  • బీఆర్ఎస్ మునిగిపోయిన పడవ అన్న తరుణ్ ఛుగ్
  • మోదీ పని తీరు చూసి బీజేపీలో చేరానన్న రాములు
BRS MP Ramulu joins BJP

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. నాగర్ కర్నూల్ ఎంపీ రాములు బీజేపీలో చేరారు. తన కుమారుడు భరత్ తో కలిసి బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జీ తరుణ్ ఛుగ్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో బీజేపీలో చేరారు. 

ఈ సందర్భంగా తరుణ్ ఛుగ్ మాట్లాడుతూ... ఎంపీ రాములు మచ్చలేని మనిషి అని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీది ముగిసిపోయిన అధ్యాయమని... అదొక మునిగిపోయిన పడవ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నియంతృత్వ పోకడలను భరించలేకే ఆ పార్టీని ప్రజలు ఓడించారని అన్నారు. రాములు సేవలు బీజేపీకి ఎంతో అవసరమని చెప్పారు. గత పదేళ్లలో ప్రధాని మోదీ అమలు చేసిన సంక్షేమ పథకాలే బీజేపీని భారీ మెజార్టీతో గెలిపిస్తాయని అన్నారు. 

రాములు మాట్లాడుతూ... సమాజం కోసం పని చేస్తున్న వారు ప్రతిరోజూ దేశంలో ఏదో ఒక ప్రాంతం నుంచి బీజేపీలో చేరుతూనే ఉన్నారని చెప్పారు. పేదరికానికి వ్యతిరేకంగా మోదీ యుద్ధం చేశారని కితాబునిచ్చారు. దేశ ఖ్యాతిని ప్రపంచం నలువైపులా విస్తరించిన వ్యక్తి మోదీ అని.. ఆయన పనితీరును చూసి బీజేపీలో చేరానని చెప్పారు.

More Telugu News