Daggubati Purandeswari: వైసీపీ ఈసారి ఎన్నికల్లో దొంగ ఓట్లనే నమ్ముకుంది: పురందేశ్వరి

Purandeswari said YCP relies on fake votes again
  • తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో అక్రమాలే అందుకు నిదర్శనమన్న పురందేశ్వరి
  • 35 వేల నకిలీ ఓటరు కార్డులు తయారుచేశారని వెల్లడి
  • ఎన్నికల సంఘాన్నే ధిక్కరిస్తున్నారని వ్యాఖ్యలు
ఏపీలో ఐదేళ్లుగా దోపిడీ పాలన సాగించిన వైసీపీ ప్రభుత్వం ఈసారి ఎన్నికల్లో దొంగ ఓట్లనే నమ్ముకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ధ్వజమెత్తారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక సమయంలో ఆ పార్టీ చేసిన అక్రమాలే అందుకు నిదర్శనమని అన్నారు. ఒక్క తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలోనే 35 వేల నకిలీ ఓటరు కార్డులు తయారుచేశారంటే... ఇంతకంటే అన్యాయం ఉంటుందా? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మండిపడ్డారు. ఇలాంటి చర్యల ద్వారా ఎన్నికల సంఘాన్ని ధిక్కరించడం తప్ప మరొకటి కాదు అని వ్యాఖ్యానించారు. 

విజయవాడలో ఇవాళ నిర్వహించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, పార్టీ మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... కేంద్రం నిధులు ఇస్తున్నప్పటికీ, అన్నీ తామే చేస్తున్నామని వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పురందేశ్వరి పార్టీ నేతలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ బలమైన శక్తిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

"రాష్ట్రంలో అవినీతి పెచ్చుమీరిపోయింది. ఆ అవినీతి భారం ఇవాళ ప్రజలపై పడుతోంది. ఇష్టం వచ్చినట్టు పన్నులు పెంచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఏపీకి కేంద్ర ప్రభుత్వం 22 లక్షల ఇళ్లు కేటాయించింది. గత ప్రభుత్వం నిర్మించిన 3 లక్షల టిడ్కో ఇళ్లను కూడా ఇవ్వలేని స్థితిలో ఈ వైసీపీ ప్రభుత్వం ఉంది. 

కట్టిన ఇళ్లు కూడా నాసిరకంగా ఉంటున్నాయి. నెల్లూరు వద్ద పిల్లర్లు కూడా లేకుండా బీమ్ ల పైనే ఇళ్లు కట్టారు. పునాదుల వద్ద బీమ్ ల కింద చేయి పెడితే... చేయి ఇట్నుంచి అటు వచ్చేస్తోంది. పేదల జీవితాలతో ఏ రకంగా ఆడుకుంటున్నారో గమనించాలి. 

శుద్ధమైన తాగునీటిని ఇంటింటికీ అందజేయాలని కేంద్రం జల్ జీవన్ పథకం ద్వారా వేలాది కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంటే... ఎన్ని ఇళ్లకు మీరు కుళాయి కనెక్షన్లు ఇచ్చారు?" అని పురందేశ్వరి ప్రశ్నించారు.
Daggubati Purandeswari
BJP
YSRCP
Andhra Pradesh

More Telugu News