Roja: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చిన మంత్రి రోజా

  • నిన్న తాడేపల్లిగూడెం సభలో పవన్ స్పీచ్
  • 24 సీట్లకు అంగీకరించడంపై జనసైనికులకు వివరణ ఇచ్చే ప్రయత్నం
  • మనకు బూత్ కమిటీలు, మండల కమిటీలు లేవని వెల్లడి
  • పార్టీ నిర్మాణం ఏనాడైనా పట్టించుకున్నావా అంటూ రోజా ఫైర్
  • చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నావు అంటూ విమర్శలు
Roja strongly replies to Pawan Kalyan remarks

టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 24 అసెంబ్లీ సీట్లు, 3 లోక్ సభ స్థానాలకు అంగీకరించడం పట్ల పవన్ కల్యాణ్ నిన్న తాడేపల్లిగూడెం సభలో సొంత క్యాడర్ కు వివరించే ప్రయత్నం చేశారు. 

మనకు పోల్ మేనేజ్ మెంట్ ఉందా? టీడీపీలాగా మనకు సంస్థాగత బలం ఉందా? జగన్ లా మన వద్ద వేల కోట్లు ఉన్నాయా? బూత్ లెవల్లో మనకు కార్యకర్తలున్నారా?... ఇవన్నీ ఆలోచించే 24 సీట్లకు ఒప్పుకున్నానని పవన్ వెల్లడించారు. ఈ క్రమంలో సీఎం జగన్ ను అథఃపాతాళానికి తొక్కేస్తానంటూ ప్రతిన బూనారు. 

దీనిపై మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. జగన్ ఏమీ ఆషామాషీగా ముఖ్యమంత్రి కాలేదని స్పష్టం చేశారు. తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు... ఊరికే అయిపోలేదుగా! అని వ్యాఖ్యానించారు. మరి నువ్వు రెండు చోట్ల నిల్చుంటే రెండు చోట్ల గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి అని విమర్శించారు. 

"ఈ రోజు సిగ్గు చేటు ఏంటంటే... ఒక పార్టీ  ప్రెసిడెంటుగా ఉండి 24 సీట్లకే పరిమితమైపోయి మళ్లీ క్యాడర్ ను తిడతాడు. మనకు ఎక్కడున్నాయి బూత్ కమిటీలు? మనకు ఎక్కడున్నాయి మండల కమిటీలు? ఈ కమిటీలను ఏర్పాటు చేయాల్సింది ఎవరండి? మండల కమిటీలు, బూత్ కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? పార్టీ అధ్యక్షుడు ఏర్పాటు చేయాలి. 

పార్టీ అధ్యక్షుడువన్న పేరు తప్ప ఏనాడైనా పార్టీ నిర్మాణం సంగతి పట్టించుకున్నావా? నీ తప్పును ఇవాళ కార్యకర్తల మీద, జనసైనికుల మీద రుద్దడం అనేది సిగ్గుచేటు. నీ ఫ్రస్ట్రేషన్ ను వాళ్లపై చూపిస్తావా? ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు నిన్న జగనన్నను అథఃపాతాళానికి తొక్కుతానంటున్నావు. చంద్రబాబు వద్ద ఊడిగం చేస్తూ నువ్వే అథఃపాతాళానికి వెళ్లావన్న విషయం నిన్నటి సభతో స్పష్టంగా అర్థమైంది" అంటూ రోజా విమర్శనాస్త్రాలు సంధించారు.

More Telugu News