USA Kid: మాట వినడం లేదని మూడేళ్ల పిల్లాడిని బాయ్ ఫ్రెండ్ కి అప్పజెప్పిన తల్లి.. కర్కశంగా ప్రవర్తించిన బాయ్ ఫ్రెండ్.. వారం రోజులుగా బాబు మిస్సింగ్!

  • అమెరికాలోని విస్కాన్సిన్ లో ఓ తల్లి కర్కశత్వం
  • తల్లితో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ పై కేసు
  • కనిపించకుండా పోయిన బాబు కోసం గాలిస్తున్న వందలాది పోలీసులు
US Woman Sent 3 Year Old Son Away To Learn To Be A Man

నిండా మూడేళ్లు కూడా లేని పిల్లాడి పట్ల ఓ తల్లి కర్కశంగా ప్రవర్తించింది. క్రమశిక్షణ నేర్పేందుకని తన బాయ్ ఫ్రెండ్ ఇంటికి పంపింది. ఆయనేమో పిల్లాడికి తిండి పెట్టకుండా, ఆడుకోనివ్వకుండా కట్టడి చేశాడు. తన బెడ్ పక్కన నిలుచుని ప్రేయర్ చదవమని ఆర్డర్ వేసి నిద్రలోకి జారుకున్నాడు. కాసేపటికి లేచి చూస్తే పిల్లాడు కనిపించలేదు. ఇంట్లో, వీధిలో వెతికినా కనిపించలేదు. ఈ నెల 20న అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం ‘టు రివర్స్’ టౌన్ లో చోటుచేసుకుందీ ఘటన. కనిపించకుండా పోయి వారం రోజులు గడవడంతో పోలీసులు టౌన్ మొత్తం జల్లెడ పడుతున్నారు. వందలాది మంది వాలంటీర్లతో సహా అన్నిచోట్లా గాలిస్తున్నారు. టౌన్ వాసులు కూడా పోలీసులకు మద్దతుగా నిలుస్తున్నారు. పిల్లాడి కోసం వెతుకుతున్న పోలీసులకు, వాలంటీర్లకు ఆహారం, నీళ్లు అందిస్తూ తమవంతు సాయం చేస్తున్నారు.

టు రివర్స్ టౌన్ కు చెందిన మహిళ కట్రినా బౌర్ తన మూడేళ్ల కొడుకు ఎలిజా వ్యూ తో కలిసి ఓ అపార్ట్ మెంట్ లో అద్దెకుంటోంది. ఇటీవల బాబు బాగా అల్లరి చేస్తున్నాడని, కాస్త దారిలో పెట్టాలని చెప్పి ఈ నెల 12న తన బాయ్ ఫ్రెండ్ జెస్సీ వాంగ్ ఇంటికి పంపించింది. అక్కడ ఎలీజాకు సరిగా తిండి పెట్టకుండా, ఆడుకోనివ్వకుండా వాంగ్ కట్టడి చేశాడు. ప్రేయర్ చదవాలని, తనకు తానుగా ఆహారం తీసుకోవాలని చెప్పేవాడు. ఏ చిన్న పొరపాటు చేసినా గంటల తరబడి నిలబెట్టేవాడు. ఈ నెల 20న ఎలిజాను తన బెడ్ పక్కనే నిలబెట్టి ప్రేయర్ చదవమని చెప్పి వాంగ్ నిద్రలోకి జారుకున్నాడు. మూడు గంటల తర్వాత కళ్లు తెరిచి చూస్తే ఎలీజా కనిపించలేదు. ఇల్లంతా వెతికినా కనిపించకపోవడంతో ఎలీజా తల్లికి, పోలీసులకు సమాచారం అందించాడు. అయితే, బాబు తల్లి, ఆమె బాయ్ ఫ్రెండ్ నిర్లక్ష్యం కారణంగానే బాబు కనిపించకుండా పోయాడని పోలీసులు కేసు పెట్టారు. తల్లిని అరెస్ట్ చేశారు.

ఎలీజా కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఊరుఊరంతా జల్లెడ పడుతున్నారు. వాలంటీర్ల సాయంతో అన్నిచోట్లా వెతుకుతున్నారు. బాబు ఆచూకీ చెప్పినా, కీలక సమాచారం అందించినా 15 వేల డాలర్ల బహుమానం ఇస్తామని ప్రకటించారు. దీంతో పాటు టౌన్ లోని ప్రజలు తమ ఇల్లు, గ్యారేజ్, తోట.. ఇలా తమ చుట్టుపక్కల జాగ్రత్తగా వెతకాలని చెప్పారు. మూడేళ్ల బాబు దాక్కునేందుకు అనువుగా ఉండే ప్రతిచోటా తనిఖీ చేయాలని సూచించారు. కాగా, ఎలీజా కోసం వెతుకుతున్న పోలీసులకు టు రివర్స్ టౌన్ వాసులు మద్దతుగా నిలుస్తున్నారు. ఆహారం, నీళ్లు అందిస్తూ తమవంతుగా సాయం చేస్తున్నారు.

More Telugu News