Director Krish: రాడిసన్ హోటల్ డ్రగ్స్‌ పార్టీ.. సినీ దర్శకుడు క్రిష్‌ను శుక్రవారం విచారించనున్న పోలీసులు

Police to question movie director krish in radison hotel drug case
  • డ్రగ్స్‌ పార్టీకి క్రిష్‌ కూడా హాజరైనట్టు తెలిసి అతడిని విచారణకు పిలిచిన పోలీసులు
  • కేసులో ఇప్పటికే పలువురి అరెస్ట్
  • హోటల్‌లో పనిచేయని సీసీ కెమెరాలు దర్యాప్తుకు అడ్డంకిగా మారిన వైనం
హైదరాబాద్‌లోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసులు సినీ దర్శకుడు క్రిష్‌ను విచారించనున్నారు. ఈ డ్రగ్స్‌ పార్టీకి క్రిష్ హాజరైనట్టు దర్యాప్తులో వెలుగులోకి రావడంతో పోలీసులు ఆయనను విచారణకు పిలవగా శుక్రవారం హాజరవుతానని ఆయన సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. 

ఈ కేసులో పలు సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన పోలీసులు వారి ఫోన్ డేటా, లావాదేవీల ఆధారంగా కొంతమంది వివరాలు సేకరించినట్టు సమాచారం. ప్రధాన నిందితుడైన గజ్జల వివేకానంద్‌కు డ్రగ్స్ సరఫరా చేసిన సయ్యద్ అబ్బాస్ అలీ జాఫ్రీని గచ్చిబౌలి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బుధవారం వివేకానంద్‌ డ్రైవర్ ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అబ్బాస్ రకరకాల మార్గాల్లో కొకైన్‌ను తెచ్చి డ్రైవర్‌ ప్రవీణ్‌‌కు ఇచ్చినట్టు దర్యాప్తులో తేలింది. ఆ తరువాత ప్రవీణ్.. వివేకానంద్‌కు ఇచ్చేవాడు. ప్రవీణ్, అబ్బాస్‌ల మధ్య నగదు లావాదేవీలను కూడా పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న రఘుచరణ్, సందీప్, నీల్, శ్వేత, యూట్యూబర్ లిషి తదితరుల ఆచూకీ ఇంకా దొరకలేదు. 

వివేకానంద్ వారాంతాల్లో హోటల్‌కు వచ్చేవాడని, తన స్నేహితులతో పార్టీలు నిర్వహించేవాడని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. అయితే, విచారణలో పోలీసులకు పలు సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. రాడిసన్ హోటల్‌లో మొత్తం 200 కెమెరాలు ఉండగా, 20 మాత్రమే పనిచేస్తున్నట్టు తెలిసింది. వివేకానంద్ పార్టీలకు అతడి స్నేహితులు, సినీ, వ్యాపార ప్రముఖులు హాజరవుతున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఎవరెవరు వస్తున్నారనే విషయం తెలుసుకునే క్రమంలో సీసీకెమెరాలు పనిచేయకపోవడం సవాలుగా మారింది. పార్టీలు జరిగినట్టుగా భావిస్తున్న గదుల సమీపంలోని కెమెరాలు కూడా పనిచేయలేదని తేలింది.
Director Krish
Drug Case
Hyderabad

More Telugu News